చేనేత రంగానికి 50 శాతం సబ్సిడీ ఇవ్వాలి

చేనేత రంగానికి 50 శాతం సబ్సిడీ ఇవ్వాలి
  • కేంద్రానికి మంత్రి కేటీఆర్ లేఖ
  • వస్త్రాలపై రెండేండ్ల పాటు జీఎస్టీ ఎత్తివేయాలని వినతి

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా ఎఫెక్టుతో తీవ్రంగా నష్టపోయిన చేనేత రంగాన్ని ఆదుకోవాలని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చేనేత, టెక్స్ టైల్స్ పరిశ్రమలకు 50 శాతం సబ్సిడీపై నూలు అందజేయాలని, ప్రస్తుత కష్ట సమయంలో ఈ రంగానికి రెండు సంవత్సరాల పాటు జీఎస్టీ మాఫీ చేయాలని కోరారు. ఈ మేరకు ఆదివారం కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీకి.. కేటీఆర్ లేఖ రాశారు. చేనేత, జౌళి పరిశ్రమలలో పనిచేస్తున్నవారికి కనీసం ఆరునెలలపాటు 50 శాతం వేతనం ఇవ్వాలని, పరిశ్రమకు అవసరమైన దీర్ఘకాలిక రుణాలను అందించాలని కోరారు. ప్రజలకు పెద్దఎత్తున ఉపాధి కల్పించే ఈ రంగంపై దృష్టి పెట్టడం ద్వారా స్థూలజాతీయోత్పత్తి, ఎగుమతులను పెంచేందుకు అవకాశం ఉందని గుర్తుచేశారు. ఇప్పటికే రాష్ట్రంలో వరంగల్, సిరిసిల్లలో మెగా టెక్స్ టైల్స్ పార్కులు ఏర్పాటు చేసిందని, ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశంతో ఈ రంగానికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతనిచ్చిందని లేఖలో పేర్కొన్నారు.