
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పరిశ్రమల మౌలికసదుపాయాల కార్పొరేషన్ (టీజీఐఐసీ) ద్వారా వివిధ ప్రాంతాల్లో 70 కంపెనీలకు 566.53 ఎకరాల భూములు కేటాయించామని టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి వెల్లడించారు. ఆ కంపెనీలు రూ.1721 కోట్లు పెట్టుబుడులు పెడుతున్నాయని, దాంతో 7,543 మందికి ఉద్యోగాలు వస్తున్నాయని సోమవారం ఓ ప్రకటనలో ఆయన చెప్పారు. రాష్ర్ట ప్రభుత్వ పరిశ్రమల పాలసీలకు అనుగుణంగా ఉన్న కంపెనీలకు ప్రభుత్వం అందించే అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు.
గత నెలలో టీజీఐఐసీ, స్టేట్ లెవెల్ ల్యాండ్ అలాట్ మెంట్ కమిటీకి వచ్చిన భూకేటాయింపుల అప్లికేషన్లను క్షుణ్ణంగా పరిశీలించి భూములు కేటాయించామన్నారు. ఇందులో ఇండోనేషియాకు చెందిన మయూర ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఫుడ్ ప్రాసెసింగ్ తయారీ పరిశ్రమ రూ.158.80 కోట్ల పెట్టుబడి పెడుతుందని, దీంతో 866 మందికి ఉపాధి లభిస్తుందని ఎండీ వెల్లడించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే ప్రతీ సంస్థకు టీజీఐఐసీ అండగా ఉంటుందని, టీజీఐఐసీ ఆధ్వర్యంలో కంపెనీలకు అందించే గజం భూమి కూడా వృధాగా పోకుండా చర్యలు చేపట్టామన్నారు.