గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకం : నిర్మల జగ్గారెడ్డి

గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకం : నిర్మల జగ్గారెడ్డి
  • టీజీఐఐసీ చైర్​పర్సన్​ నిర్మల జగ్గారెడ్డి 

సంగారెడ్డి టౌన్, వెలుగు: గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని టీజీఐఐసీ చైర్​పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి అన్నారు. సోమవారం సంగారెడ్డి పట్టణంలోని దుర్గాబాయి దేశ్ ముఖ్ మహిళా శిశు వికాస కేంద్రంలో నూతన సర్పంచులకు నిర్వహిస్తున్న శిక్షణా తరగతులకు నిర్మల జగ్గారెడ్డి, అడిషనల్​కలెక్టర్ మాధురి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..  గ్రామాల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలంటే సర్పంచులు బాధ్యతాయుతంగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. పంచాయతీ రాజ్ చట్టం ద్వారా సర్పంచులకు కల్పించిన అధికారాలు, విధులను అవగాహన చేసుకోవాలని సూచించారు. అడిషనల్​కలెక్టర్ మాధురి మాట్లాడుతూ గ్రామ స్వరాజ్యమే దేశ అభివృద్ధికి మూలమని తెలిపారు. సర్పంచులు తమ విధులు, బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు సర్పంచులు మాత్రమే హాజరుకావాలని వాటిని ఇతరులకు అప్పగించరాదన్నారు.

జిల్లాలో మొత్తం 613 మంది సర్పంచులకు శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఒక్కో బ్యాచ్‌‌‌‌కు 100 మందికి శిక్షణ అందిస్తామని జడ్పీ సీఈవో, డీపీవో జానకి రెడ్డి తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమాలు ఈనెల 19  నుంచి మార్చి 8వరకు  కొనసాగనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎల్పీఓలు అనిత, అమృత, సంజీవరావు, పంచాయతీరాజ్ అధికారులు, సర్పంచులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం సంగారెడ్డి మున్సిపల్ ఆఫీస్​ఆవరణలో మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల  చెక్కులను పంపిణీ చేశారు. 560 మహిళా సంఘాలకు రూ. కోటి 96 లక్షల 40 వేల విలువైన చెక్కులను అందించారు.