డ్రంకన్ డ్రైవ్ వద్దు..ఫ్రీ రైడ్ సేవలు అందిస్తం : టీజీపీడబ్ల్యూయూ

డ్రంకన్ డ్రైవ్ వద్దు..ఫ్రీ రైడ్ సేవలు అందిస్తం : టీజీపీడబ్ల్యూయూ
  • న్యూఇయర్ సందర్భంగా టీజీపీడబ్ల్యూయూ ప్రకటన
  •     మందుబాబులను సురక్షితంగా ఇంటికి చేరుస్తామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌‌‌‌ఫాం వర్కర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యూయూ) కీలక ప్రకటన చేసింది. న్యూఇయర్ వేడుకల సందర్భంగా మద్యం తాగి వాహనం నడపలేని స్థితిలో ఉన్నవారికి ఉచిత రైడ్ సేవలను అందిస్తామని వెల్లడించింది. డ్రంకన్ డ్రైవ్ వద్దని..ఫ్రీ రైడ్ సేవలు అందిస్తామని పేర్కొంది. ఈ సేవలు బుధవారం రాత్రి 11:00 గంటల నుంచి జనవరి1 అర్ధరాత్రి ఒంటిగంట వరకు అందుబాటులో ఉంటాయని యూనియన్ వ్యవస్థాపక ప్రెసిడెంట్ సలావుద్దీన్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 

హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధుల్లో ఈ ఉచిత ప్రయాణ సేవలుంటాయని చెప్పారు." పండుగల వేళ మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల చాలా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాలను నివారించి ప్రాణాలను కాపాడాలనే లక్ష్యంతో #HumAapkeSaathHai ప్రచారాన్ని ప్రారంభించాం. గత ఎనిమిదేండ్లుగా ప్రతి న్యూఇయర్ సందర్భంగా టీజీపీడబ్ల్యూయూ  ఉచిత రైడ్ సేవలను అందిస్తోంది. ప్రతి న్యూఇయర్‌‌‌‌లో ఆటోలు, నాలుగు చక్రాల వాహనాలతో ఉచిత సేవలు అందిస్తున్న యూనియన్.. ఈసారి బిజ్లీరైడ్‌‌‌‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. 

ఎలక్ట్రిక్ బైకులు వేగవంతమైన లాస్ట్-మైల్ స్పందన, సమన్వయ గ్రౌండ్ సపోర్ట్ ద్వారా పీక్ అవర్స్‌‌‌‌లో ఎక్కువ మందిని త్వరగా వారి ఇంటికి చేర్చవచ్చు.ప్రజలు సురక్షితంగా ఇంటికి చేరాలన్నదే మా ఏకైక ఉద్దేశం. క్యాబ్స్, ఆటోలు, ఈవీ బైక్‌‌‌‌లతో కలిపి మొత్తం 500 వాహనాలను ఈ కార్యక్రమంలో వినియోగిస్తాం” అని సలావుద్దీన్ తెలిపారు. మద్యం సేవించి స్వయంగా బండి నడపలేనివారు 89770 09804 నంబర్‌‌‌‌కు కాల్ చేసి ఉచిత రైడ్ సేవలు పొందవచ్చని సలావుద్దీన్ సూచించారు. ప్రజలు బాధ్యతాయుతంగా వేడుకలు జరుపుకోవాలని, ప్రమాదం కంటే భద్రతకే ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు.