హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా టీజీఎస్ పీడీసీఎల్(సదరన్ డిస్కమ్) పరిధిలోని 21 సర్కిళ్లలో గురువారం బస్తీబాట కార్యక్రమం నిర్వహించారు. అధికారులు, సిబ్బంది నేరుగా బస్తీలు, గ్రామాలు, కాలనీలకు వెళ్లి విద్యుత్ సమస్యలను పరిశీలించి పరిష్కరించారు. డిస్కమ్ సీఎండీ జితేష్ వి.పాటిల్ ఆదేశాల మేరకు 21 సర్కిళ్ల పరిధిలో విద్యుత్ భద్రత, నిర్వహణ, వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తూ ట్రాన్స్‌ఫార్మర్ల నిర్వహణ, యార్డ్ క్లీనింగ్, చెట్ల కొమ్మల తొలగింపు, క్రీపర్స్ తొలగింపు, విద్యుత్ లైన్ల మరమ్మతులు, లో వోల్టేజ్ సమస్యల పరిష్కారం, స్పేసర్లు, కొత్త ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు వంటి పనులు చేపట్టారు.
సిద్ధిపేట సర్కిల్ పరిధిలోని తునికి బొల్లారంలో డీఈ(ఆపరేషన్) ఆధ్వర్యంలో విద్యుత్ సమస్యలపై చర్చించారు. ములుగు ఉప విభాగంలో గ్రామస్తులతో మాట్లాడి వారి సూచనలు స్వీకరించారు. హైదరాబాద్ మెట్రో జోన్ పరిధిలోని సైదాబాద్, శంకర్‌మఠ్, లంగర్‌హౌస్, అస్మాన్‌గఢ్, లాల్‌బజార్, బైరామల్‌గూడ తదితర ప్రాంతాల్లో విద్యుత్ పనులు చేపట్టారు. మహబూబ్‌నగర్, జడ్చర్ల, దేవరకద్ర, నారాయణరావుపేట, సూర్యాపేట, నల్గొండ, మోత్కూర్, త్రిపురారం తదితర ప్రాంతాల్లో విద్యుత్ మరమ్మతు పనులు చేపట్టారు.
