
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తమ సేవలను మెరుగుపరుచుకునేందుకు మరో గొప్ప అడుగు వేసింది టీజీఎస్ఆర్టీసీ.అన్ని రంగాలను ప్రభావితం చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ను విస్తృతంగా వినియోగించాలని నిర్ణయించింది సంస్థ. తమ ఉత్పాదకత పెంపు, సిబ్బంది పనితీరు, ఆరోగ్య స్థితి పర్యవేక్షణ, ఖర్చుల తగ్గింపు, రద్దీకి అనుగుణంగా సర్వీసుల ఏర్పాటుతో పాటు సేవలను మరింత ప్రజానుకూలంగా తీర్చిదిద్దడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది ఆర్టీసీ.
ప్రజారవాణా సంస్థ ఏఐ వినియోగించడం దేశంలోనే ఇది ఫస్ట్ టైం అని తెలుస్తోంది. ఈ నిర్ణయంతో దేశంలోనే తొలిసారిగా ఏఐ వినియోగించిన ప్రజా రవాణా సంస్థగా టీజీఎస్ఆర్టీసీ నిలిచింది. హన్స ఈక్విటీ పార్టనర్స్ ఎల్ఎల్‌పీ అనే సంస్థతో కలిసి ఏఐ ప్రాజెక్టు అమలుకు సన్నాహాలు చేస్తోంది ఆర్టీసీ.సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యం, ప్రణాళికాబద్ధమైన అమలు వ్యూహాలను అందించి, అన్ని డిపోల్లో సులభంగా అమలు జరిగేలా ఆ సంస్థ సహకరిస్తోంది.
సంస్థలో ఏఐ వినియోగం కోసం ఒక ప్రత్యేక టీంను ఏర్పాటు చేసింది యాజమాన్యం. సాంకేతిక పరిజ్ఞానంపై ఆసక్తి, అవగాహన ఉన్న అధికారులను గుర్తించి.. ఆ టీంలో ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు అధికారులు. ఏఐ వాడకంపై ఆ టీంకు హన్స ఈక్విటీ పార్ట్‌నర్స్ శిక్షణ ఇస్తోందని తెలిపారు.ఏఐ ప్రాజెక్టులో భాగంగా మొదటగా 40 వేల మంది సిబ్బంది ఆరోగ్య స్థితిని పర్యవేక్షిస్తున్నారని.. గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ లో భాగంగా ఉద్యోగులకు చేసిన వైద్య పరీక్షల ఆధారంగా ఆరోగ్య పరిస్థితిన ఏఐ, మెషిన్ లెర్నింగ్ సహకారంతో అంచనా వేస్తున్నట్లు తెలిపారు అధికారులు.
మొదట పైలట్ ప్రాజెక్ట్‌గా ఆరు డిపోల్లో అమలు చేయగా.. మంచి ఫలితాలు వచ్చాయని.. ప్రస్తుతం అన్ని డిపోల్లోనూ ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నామని తెలిపారు అధికారులు. త్వరలోనే ఏఐ ద్వారా ఆటోమెటిక్ షెడ్యూలింగ్‌ను సంస్థ ప్లాన్ చేస్తోందని.. అంతేకాదు, రోజు, తిథి, పండుగులు, వారాల్లో ఏఐ, మెషిన్ లెర్నింగ్ సహకారంతో ప్రయాణికుల రద్దీని అంచనా వేసి.. ఆ మేరకు బస్సులను సంస్థ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
టీజీఎస్ఆర్టీసీలో ఏఐ ప్రాజెక్ట్ అమలు తీరు గురించి హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఇటీవల రవాణా, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సంస్థ ఉన్నతాధికారులు వివరించారు.ఆధునిక రవాణా అవసరాలకు అనుగుణంగా, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు సంస్థను ఆర్థికంగా, సాంకేతికంగా బలోపేతం చేయడం కోసం 2021 నుంచే అమలు చేస్తున్న స్ట్రాటజిక్ డిప్లాయ్‌మెంట్ ప్లాన్ (ఎస్డీపీ) కీలక పాత్ర పోషిస్తున్నదని మంత్రి దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు అధికారులు. ప్రతి నెలా ఎస్‌డీపీ సమీక్షా సమావేశాలను నిర్వహిస్తూ, స్వల్పకాలిక – దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటి అమలులో సంస్థ చురుకైన చర్యలు తీసుకుంటుందని అన్నారు.