మేడారం జాతర వైభవంగా కొనసాగుతోంది. ఇప్పటికే సారలమ్మ,పగిడిద్ద రాజు, గోవిందరాజు గద్దెపైకి చేరారు. ఇవాళ జనవరి29న సమ్మక్క తల్లి గద్దె పైకి రానున్నారు. లక్షలాది మంది భక్తులు వనదేవతలను దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి తరలివస్తున్నారు. ప్రభుత్వం కూడా అందకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది. వృద్ధులు,పిల్లలు జాతరలో తప్పిపోకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంది.
ఇందులో భాగంగా మేడారం జాతరకు వెళ్ళే ప్రయాణికులకు ఆర్టీసీ, పోలీస్ విభాగం సంయుక్తంగా ట్యాగ్ లు వేసే వినూత్న కార్యక్రమాన్ని ఉప్పల్ రింగ్ రోడ్డు దగ్గర చేపట్టారు.మేడారం జాతరలో చిన్న పిల్లలు,వృద్ధులు తప్పిపోయినట్లయితే ఈ ట్యాగ్ లో ఉండే బార్ కోడింగ్ ద్వారా వారి వివరాలు తమ ఫోన్ లో తెలుపబడతాయని ట్యాగ్ విభాగం ఇన్ ఛార్జ్ వెంకటేష్ తెలిపారు.అంతేకాకుండా ఈ ట్యాగ్ లు వేయడానికి ఎన్ సీసీ విద్యార్థులు,కళాశాల విద్యార్థులు ఉదయం షిఫ్ట్ లో 16, సాయంత్రం షిఫ్ట్ లో 16 మంది,పోలీస్ విభాగం నుంచి 8 మంది పాల్గొంటున్నారు.
►ALSO READ | మంచిర్యాల జిల్లా సమ్మక్క సారక్క జాతరలో మంత్రి వివేక్ ప్రత్యేక పూజలు
అదేవిధంగా ఆర్టీసీ మేడారం జాతరకు వెళ్లే ప్రయాణికులకు అన్ని సౌకర్యాలను కల్పించడం జరిగిందని డిప్యూటీ ఆర్ ఎం చార్మినార్ డివిజన్ బాబు నాయక్ తెలిపారు. సుమారుగా మేడారం జాతరకు తెలంగాణలోని నలుమూలల నుంచి సుమారు 4000 వరకు బస్సులను ఏర్పాటు చేశామని తెలిపారు.ముఖ్యంగా ఉప్పల్ రింగ్ రోడ్ నుండి మేడారం ప్రతిరోజు సుమారు 100 బస్సుల వరకు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులను పెంపొందించే కార్యక్రమాలను కూడా చేస్తున్నామని, దాంతోపాటు స్త్రీలకు మహాలక్ష్మి కింద ఉచిత ప్రయాణాన్ని కూడా ఏర్పాటు చేశామని తెలిపారు.సాయంత్రం టైం లో రద్దీ ఎక్కువగా ఉంటుందని తెలిపారు.
