ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్ : త్వరలో ఆర్టీసీ కార్మిక సంఘం ఎన్నికలు .. ఆ తర్వాత విలీనం ప్రక్రియ పూర్తి చేస్తాం

ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్ : త్వరలో ఆర్టీసీ కార్మిక సంఘం ఎన్నికలు .. ఆ తర్వాత విలీనం ప్రక్రియ పూర్తి చేస్తాం
  •     మంత్రి వివేక్‌‌ వెంకటస్వామి కృషితోనే గిగ్‌‌ వర్కర్ల చట్టం
  •     మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్, వెలుగు : ‘కాంగ్రెస్‌‌ ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాం, గతంలో నష్టాల్లో ఉన్న ఆర్టీసీ.. మహాలక్ష్మి స్కీమ్‌‌ కారణంగా లాభాల్లోకి వస్తోంది’ అని మంత్రి పొన్నం ప్రభాకర్‌‌ చెప్పారు. హుస్నాబాద్‌‌ ఆర్టీసీ డిపోలో శుక్రవారం నిర్వహించిన మేడే వేడుకలకు మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ శంకర్ గౌడ్‌‌కు ఫొటో వద్ద నివాళులర్పించిన అనంతరం జెండాను ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ... ఆర్టీసీ కార్మికుల పోరాటాన్ని గౌరవిస్తూ వారి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. త్వరలోనే ఆర్టీసీ కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహిస్తామని, ఎన్నికైన వారితో కలిసి విలీన ప్రక్రియను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. 

2013 బాండ్లతో పాటు 2017, 2021 పీఆర్సీ బకాయిలు, సీసీఎస్‌‌, పీఎఫ్‌‌ బకాయిలను సైతం చెల్లిస్తున్నామన్నారు. కొత్త బస్సుల కొనుగోలుతో పాటు, గతంలో ఉద్యోగాల నుంచి తొలగించబడిన వారిని మళ్లీ విధుల్లోకి తీసుకున్నామని చెప్పారు. అనంతర్‌‌ హుస్నాబాద్‌‌లో జరిగిన రేణుకా ఎల్లమ్మ తల్లి కల్యాణానికి మంత్రి దంపతులు హాజరై, పట్టువస్త్రాలు అందజేశారు. ఈ సందర్భంగా డప్పు దరువులకు మంత్రి పొన్నం ప్రభాకర్ స్టెప్పులేశారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్‌‌ చైర్‌‌పర్సన్‌‌ దండి లక్ష్మి, కమిషనర్‌‌ మల్లికార్జున్, వైస్‌‌ చైర్‌‌పర్సన్‌‌ చిత్తారి పద్మ, ఆర్టీసీ ఈడి సోలమన్, ఆర్డీవో రామ్మూర్తి, మార్కెట్ కమిటీ వైస్‌‌చైర్మన్‌‌ బంక చందు, ఏసీపీ సదానందం, ఆలయ ఈవో కిషన్‌‌రావు పాల్గొన్నారు.

మంత్రి వివేక్‌‌ కృషితోనే గిగ్‌‌ వర్కర్ల చట్టం

లక్షలాది మంది గిగ్‌‌ వర్కర్ల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఉద్దేశించిన ‘ప్లాట్‌‌ఫామ్‌‌ ఆధారిత గిగ్‌‌ వర్కర్ల సామాజిక భద్రత, సంక్షేమ బిల్లు 2026’ ఆవిర్భావంలో కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కృషి ఎంతో ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్‌‌ చెప్పారు. బిల్లు రూపకల్పన కోసం మంత్రి వివేక్ కార్మిక సంఘాలతో అనేక సమావేశాలు నిర్వహించి వారి సమస్యను తెలుసుకున్నారని చెప్పారు. కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని, గతంలో ఎన్నడూ లేని విధంగా గిగ్‌‌వర్కర్లకు రక్షణ కల్పించిన ఘనత కాంగ్రెస్‌‌ ప్రభుత్వానిదేనన్నారు.