మహారాష్ట్రలో థాక్రే సర్కార్

మహారాష్ట్రలో థాక్రే సర్కార్

18వ సీఎంగా శివసేన చీఫ్​ ఉద్ధవ్​ ప్రమాణం

హాజరైన శరద్​పవార్, అజిత్, ఫడ్నవీస్, స్టాలిన్

స్థానికులకు 80 శాతం రిజర్వేషన్లు

రైతులకు వెంటనే రుణమాఫీ

పేదల వైద్యం కోసం ‘ఒక్క రూపాయి క్లినిక్’​లు

కూటమి సర్కారు సీఎంపీలో హామీలు

బాధ్యతలు చేపట్టిన మరో ఆరుగురు మంత్రులు

ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ కోష్యారీ

హాజరైన శరద్ పవార్, అజిత్, ఫడ్నవీస్, స్టాలిన్

సోనియా గాంధీ, రాహుల్ డుమ్మా

శివసేనకు పవిత్రమైన శివాజీ పార్క్​లో కార్యక్రమం

ముంబై: మహారాష్ర్ట 18వ ముఖ్యమంత్రిగా 59 ఏళ్ల ఉద్ధవ్ థాక్రే ప్రమాణం స్వీకారం చేశారు. ముంబైలోని శివాజీ పార్క్​లో గురువారం జరిగిన కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, నేతలు, వేలాది మంది నడుమ బాధ్యతలు స్వీకరించారు. ఉద్ధవ్​చేత గవర్నర్ భగత్​సింగ్ కోష్యారీ ప్రమాణం చేయించారు. ఆయనతోపాటు మరో ఆరుగురు మంత్రులు కూడా బాధ్యతలు స్వీకరించారు. శివసేన నుంచి ఏక్​నాథ్ షిండే, సుభాష్ దేశాయ్, ఎన్సీపీ నుంచి జయంత్ పాటిల్, ఛగన్ భుజ్​బల్, కాంగ్రెస్ నుంచి బాలాసాహెబ్ థోరట్, నితిన్ రౌత్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. అజిత్ పవార్ కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్​గా ప్రమాణం చేస్తారని తొలుత వార్తలు వినిపించాయి. కానీ ఇద్దరు మాత్రమే మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం తర్వాత ‘మహారాష్ర్ట వికాస్ ఆగాధీ’ సర్కారు తొలి కేబినెట్ మీటింగ్ జరిగింది. కాగా, పదవుల పంపకంలో భాగంగా శివసేనకు 15, ఎన్సీపీ 15, కాంగ్రెస్​కు 13 కేబినెట్​బెర్త్​లు కేటాయించిన విషయం తెలిసిందే. మరోవైపు థాక్రే ఫ్యామిలీ నుంచి ముఖ్యమంత్రి అయిన తొలి వ్యక్తిగా ఉద్ధవ్ రికార్డు సృష్టించారు. మనోహర్ జోషి, నారాయణ్ రాణే తర్వాత శివసేన తరఫున ముఖ్యమంత్రి అయిన మూడో వ్యక్తి ఉద్ధవ్. సంఖ్యా పరంగా చూస్తే మహారాష్ర్టకు 29వ ముఖ్యమంత్రి. అక్టోబర్ 21న అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా, 24న రిజల్ట్స్ వచ్చాయి. బీజేపీ 105 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించగా, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 సీట్లు సాధించాయి. ఎన్సీపీ, కాంగ్రెస్​లతో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కాకుండానే ప్రమాణం చేసిన 8వ సీఎం

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కాకుండా ప్రమాణస్వీకారం చేసిన మహారాష్ట్ర ముఖ్యమంత్రుల్లో ఉద్ధవ్ థాక్రే ఎనిమిదో వ్యక్తి. అంతకుముందు ఏడుగురు సీఎంలు.. లెజిస్లేటివ్ అసెంబ్లీకి కాని, కౌన్సిల్ కు కాని ఎన్నిక కాకుండానే మహారాష్ట్ర ముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. కాంగ్రెస్​కు చెందిన ఏఆర్ అంతులే, వసంత్​దాదా పాటిల్, శివాజీరావ్ నిలంగేకర్ పాటిల్, శంకర్​రావ్ చవాన్, సుశీల్​ కుమార్ షిండే, పృథ్వీరాజ్ చవాన్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఈ లిస్టులో ఉన్నారు.

సామ్నాకు ఉద్ధవ్ గుడ్ బై​

శివసేన అధికార పత్రిక సామ్నా ఎడిటర్ పోస్ట్​కు ఉద్ధవ్ థాక్రే రాజీనామా చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎంపిక కావడంతో ఆయన తన పదవి నుంచి తప్పుకున్నారు. సామ్నా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్​గా సేన ఎంపీ సంజయ్ రౌత్ ఉన్నారు.

2 వేల మందితో బందోబస్తు

శివాజీ పార్క్​లో 2 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. క్విక్ రెస్పాన్స్ టీమ్స్, రాయిట్ కంట్రోల్ పోలీస్, స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, లోకల్ ఆర్మ్​డ్ పోలీస్, బాంబ్ డిటెక్షన్, డిస్పోజల్ స్క్వాడ్​లతో సెక్యూరిటీ ఏర్పాటు చేశారు.

వచ్చింది వీళ్లే..

ఉద్ధవ్ ప్రమాణ స్వీకారానికి ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్, చత్తీస్​గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బాఘెల్, మాజీ ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, మనోహర్ జోషి, అశోక్ చవాన్​, పృథ్వీరాజ్ చవాన్, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, నవ నిర్మాణ సేన చీఫ్ రాజ్​థాక్రే, కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, అహ్మద్ పటేల్, ఎన్సీపీ నేతలు అజిత్ పవార్, సుప్రియా సూలె, ప్రఫుల్ పటేల్, శరద్ యాదవ్ (లోక్​తాంత్రిక్ జనతాపార్టీ)​, పారిశ్రామిక వేత్త ముఖేశ్ అంబానీ దంపతులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఉద్ధవ్ భార్య రష్మి థాక్రే, కొడుకు ఆదిత్య థాక్రే కూడా వచ్చారు. అయితే కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మాత్రం రాలేదు. ఉద్ధవ్​కు విషెస్ చెప్పారు. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఉద్ధవ్​కు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు.

కంగ్రాట్స్ ఉద్ధవ్

కంగ్రాచ్యులేషన్స్ ఉద్ధవ్ థాక్రే జీ.. మహారాష్ట్ర భవిష్యత్​ను అద్భుతంగా తీర్చిదిద్దేలా పనిచేస్తారన్న నమ్మకం నాకుంది.

– ప్రధాని నరేంద్ర మోడీ