బ్యాంకాక్: ఇండియా డబుల్స్ స్టార్ షట్లర్లు సాత్విక్–చిరాగ్ షెట్టి జోడీ.. థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్–500 టోర్నీలో రన్నరప్‌తో సరిపెట్టుకున్నారు. ఆదివారం జరిగిన మెన్స్ డబుల్స్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ 12–21, 23–25తో లియో రోలి కర్నాండో–డానియెల్ మార్టిన్ (ఇండోనేషియా) చేతిలో ఓడారు.
2019, 2024లో ఇక్కడ టైటిల్ గెలిచిన ఇండియన్ ద్వయం ఈసారి దాన్ని పునరావృతం చేయలేకపోయింది. 53 నిమిషాల మ్యాచ్‌లో సాత్విక్–చిరాగ్ తొలి గేమ్‌లోనే లయ కోల్పోయారు. దాంతో ఇండోనేషియా ద్వయం 4–1 ఆధిక్యంలోకి వెళ్లింది. తర్వాత మార్టిన్ కొట్టిన పవర్‌ఫుల్ స్మాష్‌లను తీయలేక 8–13తో వెనకబడ్డారు.
ఇక్కడి నుంచి వరుస తప్పిదాలతో గేమ్‌ను చేజార్చుకున్నారు. రెండో గేమ్‌లో ఇద్దరూ హోరాహోరీగా తలపడటంతో స్కోరు 9–9తో సమమైంది. తర్వాత రెండు స్మాష్‌లతో ఇండియన్ జోడీ బ్రేక్ టైమ్‌కు 11–9 లీడ్‌లోకి వచ్చింది. ఈ దశలో ఇండోనేషియన్లు బలమైన క్రాస్ కోర్టు ర్యాలీలు ఆడటంతో 14–14, 19–19 వరకు గేమ్ నువ్వా–నేనా అన్నట్లుగా సాగింది. ఈ టైమ్‌లో మార్టిన్ కొట్టిన తొలి చాంపియన్‌షిప్ పాయింట్‌ను సాత్విక్ జోడీ కాపాడుకోవడంతో స్కోరు 20–20గా మారింది.
రెండో పాయింట్‌ను చిరాగ్ నెట్ కిల్‌తో అడ్డుకున్నాడు. సాత్విక్ సర్వీస్ తప్పిదంతో మూడో అవకాశం వచ్చినా షటిల్ లైన్ వెలుపల పడటంతో ఇండోనేషియా పాయింట్ కోల్పోయింది. నాలుగో పాయింట్‌ను కూడా ఇండియన్లు విజయవంతంగా తిప్పికొట్టారు. అయితే ఐదో చాంపియన్‌షిప్ పాయింట్ వద్ద మార్టిన్ కొట్టిన షాట్‌ను రిటర్న్ చేయడంలో సాత్విక్ జోడీ విఫలం కావడంతో మ్యాచ్ ఇండోనేషియా వశమైంది.
