బ్యాంకాక్: ఇండియా బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు.. థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్–500 టోర్నీలో క్వార్టర్‌ఫైనల్లోనే నిష్క్రమించింది. శుక్రవారం జరిగిన విమెన్స్ సింగిల్స్ మ్యాచ్‌లో ఆరోసీడ్ సింధు 21–19, 18–21, 15–21తో టాప్‌సీడ్ అకానె యమగుచి (జపాన్) చేతిలో పోరాడి ఓడింది. ముఖాముఖి రికార్డులో 15–13 ఆధిక్యంలో ఉన్న తెలుగు షట్లర్ ఈ మ్యాచ్‌లో మాత్రం పైచేయి సాధించలేకపోయింది.
గంట పాటు జరిగిన పోరులో యమగుచి బలమైన స్మాష్‌లు, ర్యాలీలతో సింధును కట్టిపడేసింది. తొలి గేమ్‌లో ప్రతి పాయింట్ కోసం ఇద్దరు నువ్వా, నేనా అన్నట్లుగా తలపడటంతో స్కోరు 19–19 వరకు సమంగా సాగింది. ఈ దశలో సింధు రెండు నెట్ డ్రాప్స్ వేసి గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో 5–1తో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచిన సింధు ఆ తర్వాత వెనకబడింది.
యమగుచి క్రాస్ కోర్టు విన్నర్లతో 11–11తో స్కోరును సమం చేసింది. ఆ వెంటనే 14–11 లీడ్‌తో ముందుకెళ్లి 21–18తో గేమ్‌ను సాధించింది. డిసైడర్‌లో 0–5తో వెనకబడిన ఇండియన్ షట్లర్ 11–12తో రేసులోకి వచ్చే ప్రయత్నం చేసింది. కానీ యమగుచి వ్యూహాత్మకంగా షాట్స్ ఆడి సింధును అడ్డుకుంది. మెన్స్ సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో ఏడోసీడ్ లక్ష్యసేన్ 19–21, 16–21తో కున్లావట్ విటిడార్సన్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడాడు. మెన్స్ డబుల్స్ క్వార్టర్స్‌లో టాప్‌సీడ్ సాత్విక్–చిరాగ్ షెట్టి 21–12, 21–13తో టకుమి నొమురా–యుచి షిమోగామి (జపాన్)పై గెలిచి సెమీస్‌లోకి ప్రవేశించారు.
