సోషల్ మీడియా వచ్చాక చిన్నా పెద్దా తేడా లేకుండా పోయింది. ఫేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్ అంటూ అందరూ అకౌంట్ తెరుస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ వారు సైతం అప్డేట్స్ను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ యాక్టివ్‌గా ఉంటున్నారు. కానీ సోషల్ మీడియాకి దూరంగా ఉండేవాళ్లూ ఉన్నారు. వాళ్లలో అజిత్ ఒకరు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్.. ప్రతి చోటా అజిత్‌ని అభిమానించే వాళ్లు కోకొల్లలు. అలాంటిది ఆయన సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేకపోవడం, తన సినిమాల తాలూకు అప్డేట్స్ ఇవ్వకపోవడం గురించి అభిమానులు నిరాశకు గురవుతున్నా అది తన వ్యక్తిగత విషయం కనుక ఆయన ఎప్పుడూ స్పందించలేదు. కానీ ఈ మధ్యనే ‘నేను త్వరలో సోషల్ మీడియాలో ఎంటర్ అవబోతున్నా.. నేను కూడా నా సినిమాలు.. వ్యక్తిగత విషయాలు మీతో షేర్ చేసుకుంటా’ అంటూ ఆయన సంతకంతో ఉన్న లెటర్ హెడ్ ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యింది. అది చూసిన ఫాన్స్ ఎగిరి గంతేశారు.. కానీ ఇంతలోనే ‘అది ఫేక్ న్యూస్, అసలు అజిత్‌కి సోషల్ మీడియా అంటే ఇష్టం ఉండదు. ప్రస్తుతం మీడియాలో ప్రచారం అవుతున్న లెటర్ ఫేక్. ఆయన పేరుతో ఏ అకౌంటూ లేదంటూ అజిత్ పీఆర్ టీమ్ కచ్చితంగా చెప్పేసింది. మరి ఒరిజినల్ సిగ్నేచర్‌తో ఉన్న ఆ లెటర్ హెడ్ ఎలా బయటకు వెళ్లిందో మాత్రం తెలియాల్సి ఉంది. కానీ అజిత్ అభిమానులు చాలా నిరాశ పడ్డారన్నది మాత్రం నిజం.
