ఆయనే మంత్రి..ఆయనే మేయర్!

ఆయనే మంత్రి..ఆయనే మేయర్!
  • గ్రేటర్​ హైదరాబాద్​లో మంత్రి తలసాని దూకుడు
  • పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆయనదే హడావుడి
  • అభివృద్ధి కార్యక్రమాల్లో మేయర్ను, ఎమ్మెల్యేలను పట్టించుకోని తీరు
  • కార్పొరేటర్లు, పార్టీ కేడర్లో అసంతృప్తి.. తలసాని పోకడలపై విమర్శలు..
  • ఇలానే ఉంటే పార్టీకి నష్టం తప్పదంటున్న నేతలు

హైదరాబాద్, వెలుగుఆయన రాష్ట్ర మంత్రి.. రెండు శాఖల బాధ్యతలు ఆయన చేతిలో ఉన్నాయి.. కానీ హైదరాబాద్​లో ఏ చిన్న కార్యక్రమం జరిగినా ఆయనదే పెత్తనం.. ప్రభుత్వ ప్రోగ్రాములైనా సరే, పార్టీ కార్యక్రమాలైనా సరే ఆయనదే హడావుడి.. జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్షలూ ఆయనే పెడతారు. ఏమేం చేయాలో ఆయనే చెబుతారు. హైదరాబాద్​ మేయర్ సహా కార్పొరేటర్లు, లోకల్​ ఎమ్మెల్యేలు, అధికారులెవరినీ పిలిచేది లేదు.. ఎవరికీ చెప్పేది లేదు.. మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్  తీరు ఇది. ప్రభుత్వ కార్యక్రమాల్లో, పార్టీ వ్యవహారాల్లో ఆయన చేస్తున్న హడావుడి అటు అధికారులు, ఇటు టీఆర్ఎస్​ నేతలు, కార్యకర్తల్లో(మొదటి పేజీ తరువాయి)

తీవ్ర అసంతృప్తిని, అసహనాన్ని రేకెత్తిస్తోంది. ఆయన రాష్ట్ర మంత్రా, గ్రేటర్​ హైదరాబాద్​కు మేయరా అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ నేతలందరినీ కలుపుకొని వెళ్లాల్సిన చాలా అంశాల్లో తలసాని ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని  పార్టీ లీడర్లే చెప్తున్నారు. ఆయన ఏం చెబితే అదే నడవాలన్నట్టుగా వ్యవహరిస్తున్నారని.. హైదరాబాద్ అభివృద్ధి అంశాలకు సంబంధించి లోకల్​ ఎమ్మెల్యేలు, సీనియర్​ నేతలను కూడా పట్టించుకోవడం లేదని అంటున్నారు.

మేయర్ ను పట్టించుకోరా?

గ్రేటర్  హైదరాబాద్​ పరిధికి ప్రథమ పౌరుడు మేయర్. లోకల్​గా ప్రొటోకాల్ ప్రకారం సీఎం కన్నా ఎక్కువ అని ఓ సందర్భంలో స్వయంగా కేసీఆరే చెప్పారు. గ్రేటర్ పరిధిలో జరిగే ఏ ప్రభుత్వ కార్యక్రమంలోనైనా మేయర్ కు ఫస్ట్​ ప్రయారిటీ ఉండాలి. కానీ తలసాని శ్రీనివాస్​ యాదవ్​ రెండోసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టాక.. అంతా తానే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని, మేయర్​ బొంతు రామ్మోహన్​ను నామమాత్రంగా మార్చేశారని విమర్శలు వస్తున్నాయి. తలసాని సనత్ నగర్ ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే హైదరాబాద్​ జల మండలి అధికారులతో సమీక్షా సమావేశం పెట్టడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఆ సమయంలో మేయర్​కుగానీ, జల మండలి ఎండీకి గానీ సమాచారం ఇవ్వలేదని సమాచారం.  ఇక చేప మందు పంపిణీ ఏర్పాట్లు, బోనాల జాతర పనుల సమీక్షలు, డబుల్ బెడ్రూం ఇండ్ల రివ్యూలు, ఇటీవల ఆసరా పింఛన్ల పెంపు వంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎక్కడా మేయర్ కనిపించలేదు. నిజానికి ఇవన్నీ జీహెచ్ఎంసీ పర్యవేక్షణలోనే జరగాల్సి ఉండటం గమనార్హం.

ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లలో అసంతృప్తి

తలసాని వెంట ఉంటున్న చాలా మంది నేతలకు కూడా ఆయనంటే పడటం లేదని, పార్టీ హైకమాండ్ వద్ద తన హవా కొనసాగుతుండటంతో ఎవర్నీ పట్టించుకోవడం లేదని టీఆర్ఎస్​ వర్గాలు చెబుతున్నాయి. తన కుమారుడికి సికింద్రాబాద్ లోక్ సభ టికెట్ వచ్చిన నాటి నుంచి.. ఇక తనకు ఎదురులేదన్న భావనలో తలసాని ఉన్నారని కొందరు నేతలు విమర్శిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల సమయంలోనూ ఆయన ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లను కలుపుకొని పోలేదన్న ఆరోపణలున్నాయి. ఎల్బీ స్టేడియంలో సీఎం సభకు సంబంధించి నేతల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపించింది. జనం లేకపోవటంతో ఆ సభ రద్దు చేశారు కూడా. ఇదే సందర్భంలో మేయర్ ను ఉద్దేశించి తలసాని పరుషంగా వ్యాఖ్యలు చేశారు. దీంతో ఎన్నికల్లో తలసానికి కేడర్ నుంచి సపోర్ట్ రాలేదు. చివరికి కేటీఆర్ ఆదేశాల కారణంగా ఎన్నికలకు రెండు రోజుల ముందు మాత్రమే కార్పొరేటర్లు ప్రచారం చేశారు. అయినా తలసాని కుమారుడు ఓడిపోయారు. ఆయన సొంత అసెంబ్లీ సెగ్మెంట్​ అయిన సనత్ నగర్ పరిధిలోనూ టీఆర్ఎస్ కు ఆధిక్యం రాలేదు.

కార్పొరేటర్లకు ఇబ్బంది..

జీహెచ్ఎంసీకి ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ తలసాని పలుమార్లు చేసిన వ్యాఖ్యలు కార్పొరేటర్లలో, కేడర్​లో అసహనానికి కారణమవుతున్నాయి. సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిన తన కుమారుడి గెలుపు కోసం సహకరించలేదన్న కారణంగానే మేయర్‌, కార్పొరేటర్లను ఇబ్బంది పెట్టేలా తలసాని కామెంట్లు చేస్తున్నారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

పార్టీకే నష్టమంటున్న నేతలు

హైదరాబాద్ లో పార్టీ, ప్రభుత్వానికి తానే పెద్ద అన్నట్టుగా తలసాని వ్యవహరిస్తున్నా హైకమాండ్​ పట్టించుకోవటం లేదని పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది కచ్చితంగా పార్టీకి నష్టం చేస్తుందని.. ఇప్పటికే మేయర్‌, కొందరు ఎమ్మెల్యేలు అంటీముట్టనట్టుగా ఉంటున్నారని, తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో కనిపించి వెళ్లిపోతున్నారని అంటున్నారు.

సీనియర్లూ సైలెంట్..

తలసానికి హైకమాండ్​ ప్రాధాన్యం, దాంతో ఆయన వ్యవహరిస్తున్న తీరుపై అసంతృప్తి కారణంగానే.. నగరంలో పేరున్న లీడర్లెవరూ టీఆర్ఎస్​ కార్యక్రమాల్లో యాక్టివ్​గా కనిపించడం లేదని పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. గ్రేటర్  పరిధిలో డిప్యూటీ స్పీకర్​ పద్మారావు, గతంలో మంత్రులుగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి, దానం నాగేందర్, పలుమార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన సుధీర్ రెడ్డి, మాగంటి గోపీనాథ్, కేపీ వివేకానంద, అరికెపూడి గాంధీ, మైనంపల్లి హన్మంతరావు, ప్రకాశ్​గౌడ్ వంటి నేతలు కీలకంగా వ్యవహరిస్తుంటారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచీ పార్టీలో పనిచేసిన నేతలూ కొందరున్నారు. ఇప్పుడు వారంతా తలసాని కారణంగా సైలెంట్ అయిపోయారని టీఆర్ఎస్​ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ సభ్యత్వ నమోదు విషయంలో తానే గ్రేటర్ పార్టీ అధ్యక్షుడిని అన్నట్టుగా తలసాని తీరు ఉందన్న విమర్శలు వస్తున్నాయి. ఈ కారణంగానే హైదరాబాద్​ పరిధిలో పార్టీ మెంబర్​షిప్​భారీగా తగ్గినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని శుక్రవారం తెలంగాణ భవన్​లో జరిగిన మీటింగ్​లో పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ కూడా ప్రస్తావించడం గమనార్హం