
భర్త నుంచి విడాకులు తీసుకుని అన్నదమ్ముల ఇంట్లో ఉండేందుకు వచ్చిన సోదరిని తోబుట్టువులే కిరాతకంగా చంపి ముక్కలు చేశారు. గుట్టుగా ఆమె మృతదేహాన్ని తగటబెట్టి పరారయ్యారు. ఈ దారుణానికి పాల్పడిన నలుగురు అన్నదమ్ముల్లో ముగ్గురిని అరెస్టు చేశారు పోలీసులు. మరొకరి కోసం పోలీసులు గాలింపు చేపడుతున్నారు. మహారాష్ట్రలోని థానేలో ఈ ఘటన జరిగింది.
థానే జిల్లాలోని డయాగఢ్‌కు చెందిన ప్రతిభా మహత్రే (29) అనే మహిళ కొన్నాళ్ల క్రితం తన భర్తతో విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయింది. ఆ తర్వాత సోదరుల ఇంటికి వెళ్లి వారితో కలిసి ఉంటోంది. అయితే ఓ బీర్ బారులో పని చేస్తున్న ఆమె తీరుపై అన్నదమ్ములకు అనుమానం వచ్చింది. ఆమె చట్ట వ్యతిరేక పనులు చేస్తోందన్న డౌట్ రావడంతో ఇంటిని నుంచి వెళ్లి వేరుగా ఉండాలని పలుమార్లు చెప్పారు. అయితే మే 1న రాత్రి మరోసారి ఇంటి నుంచి వెళ్లాలని చెప్పడంతో ఆ సమయంలో వారితో ప్రతిభ వాగ్వాదానికి దిగింది. దీంతో మాటామాటా పెరిగి క్షణికావేశంలో నలుగురు సోదరులూ కలిసి ఆమెను హత్య చేశారు. నేరం బయటపడితే జైలుకెళ్లాల్సి వస్తుందన్న భయంతో ఆమె మృతదేహాన్ని ముక్కలు చేసి, ప్లాస్టిక్ బ్యాగ్‌లో పెట్టి.. టైర్లు, కర్రలు వేసి కాల్చేశారు. పూర్తిగా కాలీకాలని భాగాలను ఓ కాలువలో పడేశారు. అయినప్పటికీ నేరం చేసిన భయంతో పరారీలోకి వెళ్లారు. అసంపూర్తిగా కాలి ఉన్న మహిళ శరీర భాగాలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను మంగళవారం రాత్రి అరెస్టు చేశామని చెప్పారు థానే డీసీపీ బుర్సే చెప్పారు. వారిని నతా అశోక్ పాటిల్ (31), భగవాన్ పాటిల్ (24), బాలాజీ పాటిల్ (20)గా గుర్తించామని, ఈ ముగ్గురూ బాధితురాలి అన్నదమ్ములేనని తెలిపారు. మరో సోదరుడు పాండురంగ అశోక్ పాటిల్ కూడా ఈ నేరంలో పాల్గొన్నాడని, అతడు పరారీలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.