థ్యాంక్యూ దుబాయ్.. COP28సమ్మిట్ హైలెట్స్ షేర్ చేసిన మోదీ

థ్యాంక్యూ దుబాయ్.. COP28సమ్మిట్ హైలెట్స్ షేర్ చేసిన మోదీ

డిసెంబర్ 1న దుబాయ్‌లో జరిగిన కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్-28 (COP28)లో పాల్గొన్న తర్వాత, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ COP28 వీడియోను పంచుకున్నారు. మెరుగైన భూగోళం కోసం కలిసి పనిచేయడానికి తన నిబద్ధతను పునరుద్ఘాటించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో వీడియోను పంచుకుంటూ, కొన్ని కీలక క్షణాలను ఇందులో హైలైట్ చేశారు.

ఈ వీడియోలో ద్వైపాక్షిక సమావేశాలకు సంబంధించిన ఫొటోలు, ప్రపంచ నేతలతో పరస్పర చర్చలు, వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా అన్ని దేశాల సహకారంపై దృష్టి సారించిన ఆయన శిఖరాగ్ర ప్రసంగానికి సంబంధించిన చిత్రాలున్నాయి. ఓ వీడియోలో, దుబాయ్‌లో జరిగిన COP28 వరల్డ్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్ సందర్భంగా అనేక మంది ప్రపంచ నాయకులతో మోదీ కరచాలనం చేయడం, పాల్గొనడం కూడా కనిపించింది.

"ధన్యవాదాలు, దుబాయ్. ఇది ఉత్పాదకతతో కూడిన COP28 సమ్మిట్. మంచి భూగోళం కోసం అందరం కలిసి పని చేద్దాం" అని ప్రధాని మోదీ ఈ పోస్ట్‌లో రాశారు. శిఖరాగ్ర సదస్సులో భాగంగా, కింగ్ చార్లెస్ IIIతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటంలో కింగ్ చార్లెస్‌ ముఖ్యమైన గొంతుక అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే వియత్నాం ప్రధాని ఫామ్ మిన్ చిన్‌తోనూ ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఇరువురు నేతలు వివిధ అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారు. వియత్నాం ప్రధాని మిస్టర్ ఫామ్ మిన్ చిన్‌ను కలిశానని, వివిధ అంశాలపై చర్చించామని ప్రధాని మోదీ Xలో పోస్ట్ చేశారు.