హైదరాబాద్ లోకి ఎంటరైన ధార్​ గ్యాంగ్

హైదరాబాద్ లోకి ఎంటరైన ధార్​ గ్యాంగ్
  • దోపిడీలతోపాటు దాడులకు పాల్పడుతున్నట్లు సమాచారం
  • శివారు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసుల సూచన
  • గస్తీ పెంచాం.. బయాందోళన వద్దు: ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్

ఎల్బీనగర్/ఘట్​కేసర్, వెలుగు: చడ్డీ గ్యాంగ్​మాదిరి దోపిడీలు, దాడులకు పాల్పడే మధ్యప్రదేశ్​కు చెందిన ‘ధార్ గ్యాంగ్’ సిటీలో తిరుగుతోందని పోలీసులు తెలిపారు. శివారు ప్రాంతాల ప్రజలను టార్గెట్​చేస్తునట్లు చెప్పారు. రాత్రి వేళల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ గ్యాంగ్​లోని కొందరు ఇప్పటికే హయత్ పోలీస్​స్టేషన్​పరిధిలోని ‘ప్రజయ్ గుల్మోహర్ గేటెడ్ కమ్యూనిటీ’లో చోరీ చేశారని వెల్లడించారు. 

ప్రహరీ గోడపై ఏర్పాటు చేసిన సోలార్ వైర్లను కట్ చేసి లోపలికి చొరబడ్డారని చెప్పారు. ఐదు ఇండ్లలో చోరీకి యత్నించారని, ఇంట్లోని నగదు, బంగారం, వెండి వస్తువులు ఎత్తుకెళ్లారని వివరించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణలో చోరీకి పాల్పడింది మధ్యప్రదేశ్ కు చెందిన ‘థార్’ అనే భయానక దొంగల ముఠా అని తేల్చారు. సిటీ శివారులో సంచరిస్తున్నట్లు గుర్తించారు. హయత్ నగర్, అబ్దుల్లాపూర్ పూర్ మెట్, ఘట్ కేసర్  పోలీస్ స్టేషన్ల పరిధిలోని కాలనీల ప్రజలు రాత్రిళ్లు ఒంటరిగా తిరగొద్దని పోలీసులు సూచిస్తున్నారు.

గ్రామీణ ప్రాంతాల అలర్ట్ గా ఉండాలని చెప్పారు. ఈ గ్యాంగ్​లోని సభ్యులు శివారులోని హోటల్స్ లో ఉండే అవకాశం ఉందని, పగలు రెక్కి నిర్వహించి, రాత్రిళ్లు చోరీలకు పాల్పడతారని పోలీసులు చెబుతున్నారు. గ్యాంగ్​లో ఐదుగురు, అంత కంటే ఎక్కువ మంది ఉంటారంటున్నారు. అర్ధరాత్రి ఎవరైనా తలుపు తడితే ఎట్టి పరిస్థితుల్లో తీయొద్దని, వచ్చిన వ్యక్తులు ఎవరో నిర్ధారించుకున్నాకే ఓపెన్​చేయాలని అప్రమత్తం చేస్తున్నారు.

అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే డయల్​100 కు ఫోన్​చేయాలని సూచిస్తున్నారు. అబ్దుల్లాపూర్ మెట్ ఎస్ హెచ్ఓ:87126 62302; హయత్ నగర్ ఎస్ హెచ్ఓ:87126 62301;  అబ్దుల్లాపూర్ మెట్ స్టేషన్ : 87126 62650 నంబర్లకు సమాచారం అందించాలని కోరుతున్నారు. ధార్​గ్యాంగ్​కదలికలను గుర్తించాక, శివారు ప్రాంతాల్లో పెట్రోలింగ్​పెంచామని ఎల్బీనగర్​డీసీపీ ప్రవీణ్ కుమార్ తెలిపారు. రాచకొండలోని అన్ని స్టేషన్ల పోలీసులు అప్రమత్తమయ్యారని చెప్పారు.