తెలంగాణ సంపదను ఏటీఎంలా.. దోచుకుంటున్నరు

తెలంగాణ సంపదను ఏటీఎంలా.. దోచుకుంటున్నరు
  • కల్వకుంట్ల కుటుంబ పాలనలో రాష్ట్రం బందీ: తరుణ్​చుగ్​

హైదరాబాద్, వెలుగు:  సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు తెలంగాణ రాష్ట్ర సంపదను ఏటీఎంలా దోచుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర వ్యహారాల ఇన్​చార్జ్​ తరుణ్ చుగ్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో కేసీఆర్ అవినీతితో ఇక్కడి ప్రజలు విసిగెత్తిపోయారని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావడం ఖాయమన్నారు. గురువారం మేడ్చల్ అర్బన్ జిల్లా బీజేపీ కార్యకర్తల సమావేశంలో తరుణ్ చుగ్ పాల్గొన్నారు. అనంతరం అక్కడి  పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 

ఎందరో ఆత్మబలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణ.. ఇప్పుడు ఒక కుటుంబ పాలనలో బందీ అయిందని ధ్వజమెత్తారు. దోచుకో.. దాచుకో అనే రీతిలో ప్రతి పనిలో పెద్ద మొత్తంలో కమీషన్లు తీసుకుంటూ.. తెలంగాణ సొమ్మును కేసీఆర్,  ఆయన కుటుంబ సభ్యులు లూటీ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ అవినీతికి ఆ కుటుంబం భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని బూత్ స్థాయిలో పర్యటించాలని, ప్రజలను కలుస్తూ వారి సమస్యలపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. 

ఈ 4 నెలలు పార్టీ కోసం పూర్తి సమయం కేటాయించాలని, బీఆర్ఎస్​ను ఓడించి ఇంటికి సాగనంపుతామనే శపథం ప్రతి కార్యకర్త చేయాలన్నారు. కేంద్రంలో మోదీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఇదే సమయంలో కేసీఆర్ అవినీతి, నియంత, కుటుంబ పాలనపై ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని పార్టీ కార్యకర్తలను కోరారు. కాగా, కూకట్​పల్లి సెగ్మెంట్ పరిధి కైత్లాపూర్​లో బీజేపీ ఆఫీసును గురువారం సాయంత్రం బీజేపీ జాతీయ కార్యదర్శి తరుణ్ చుగ్ ప్రారంభించారు. కాగా, కూకట్​పల్లి సెగ్మెంట్ పరిధి కైత్లాపూర్​లో బీజేపీ ఆఫీసును గురువారం సాయంత్రం తరుణ్ చుగ్ ప్రారంభించారు.