అదో నల్ల చట్టం.. ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం

అదో నల్ల చట్టం.. ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్‌‌‌‌ చట్టసవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని శాసనమండలిలో అధికార, ప్రతిపక్షాలు డిమాండ్​ చేశాయి. సోమవారం మండలిలో చైర్మన్‌‌‌‌ గుత్తా సుఖేందర్‌‌‌‌రెడ్డి అధ్యక్షతన ‘‘కేంద్ర విద్యుత్‌‌‌‌ బిల్లు–పర్యవసానాలు”అనే అంశంపై షార్ట్‌‌‌‌ డిస్కషన్‌‌‌‌ జరిగింది. విద్యుత్ బిల్లును టీఆర్ఎస్ సభ్యులతోపాటు ఎంఐఎం, కాంగ్రెస్‌‌‌‌ సభ్యులు, టీచర్‌‌‌‌ ఎమ్మెల్సీలు వ్యతిరేకించారు. ఇది నల్లచట్టమని, ఫెడరల్‌‌‌‌ స్ఫూర్తికి విఘాతం కలిగించేలా ఉందని అన్నారు. కేంద్రం విధానాలతో దేశం వెనుకబడిందని, దేశాన్ని ఇద్దరు అమ్ముకుంటుంటే మరో ఇద్దరు కొంటున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి మాట్లాడుతూ.. గుజరాత్ లో వ్యవసాయ రంగానికి రోజుకు ఎనిమిది గంటల సరఫరానే ఉందని, అది కూడా యూనిట్ కు 60 పైసల చొప్పున వసూలు చేస్తున్నారని ఆరోపించారు. విద్యుత్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు తెలుపుతున్నట్టు మజ్లిస్‌‌‌‌ ఎమ్మెల్సీ జాఫ్రీ ప్రకటించారు. టీచర్‌‌‌‌ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ.. విద్యుత్ బిల్లు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందని, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ దానిని తిరస్కరించాలన్నారు. విదేశీ బొగ్గునే కొనాలనే ఆంక్షలు ఆదానీ ప్రయోజనం కోసమేనని స్పష్టం చేశారు. విద్యుత్ సంస్థలకు కేంద్ర సంస్థలు రుణాలను ఆపడం సరికాదని, కరెంటు బాకీ ఎవరెంత ఉన్నారో నిష్పక్షపాతంగా నోటీసులివ్వాలని డిమాండ్ చేశారు.

జీవన్‌‌‌‌రెడ్డికి అడ్డుతగిలిన పల్లా

రాష్ట్రంలో 24 గంటల కరెంటు సరఫరా చేసే పరిస్థితి లేదని, రైతులంతా ఒకేసారి మోటర్లు నడపడంతో ట్రాన్స్​ఫార్మర్లపై భారం పడి కాలిపోతున్నాయని కాంగ్రెస్​ ఎమ్మెల్సీ జీవన్‌‌‌‌రెడ్డి అన్నారు. ఈ సమయంలో టీఆర్ఎస్ సభ్యుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి అడ్డుతగిలి జీవన్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని అభ్యంతరం తెలిపారు.  జగిత్యాలలో రోజుకు 15 నుంచి 20 ట్రాన్స్​ఫార్మర్లు కాలిపోతున్నాయని, తాను చెప్పేది అబద్ధమైతే సబ్​​స్టేషన్ల వారీగా శ్వేతపత్రం విడుదల చేయాలని జీవన్‌‌‌‌రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా 25.6 లక్షల పంపుసెట్లు, అనధికారికంగా 4.5 లక్షల మోటర్లకు వద్దన్నా 24 గంటల కరెంటు ఇస్తున్నామని పల్లా చెప్పారు. ఓవర్ లోడ్​ సమస్య లేదని, జీవన్ రెడ్డి ఇంకా ఏపీ ప్రభుత్వం ఉందనే ఆలోచనలోనే ఉన్నట్లున్నారని ఎద్దేవా చేశారు. కేంద్ర విద్యుత్ బిల్లును వ్యతిరేకిస్తున్నామని, ఎన్టీపీసీ 4,000 మెగావాట్ల నిర్మాణం సకాలంలో పూర్తి చేయాలని కేంద్రంపై ఒత్తిడి తేవాలని జీవన్​రెడ్డి అన్నారు. ప్రభుత్వ స్కూళ్లకు ఉచిత కరెంటు అమలు చేయాలని టీచర్​ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి కోరారు. కాటేపల్లి జనార్దన్ రెడ్డి, వాణిదేవి, భానుప్రసాద్, తాత మధు, యగ్గే మల్లేశం, యాదవరెడ్డి తదితరులు కూడా కేంద్ర విద్యుత్‌‌‌‌ బిల్లును తప్పుబట్టారు.