ఏ యాక్టర్ అయినా ప్రారంభంలో చేసే పాత్రలు వారి కెరీర్‌ని నిర్ణయిస్తాయి. ముఖ్యంగా క్యారెక్టర్ ఆర్టిస్టులు, హీరోయిన్స్ విషయంలో ఈ ప్రభావం చాలా ఎక్కువ. తొలినాళ్లలో ఏదైనా తేడా కొట్టిందో.. ఇక అంతే. బాలీవుడ్ హీరోయిన్ రియా సేన్ విషయంలో అలాగే జరిగిందట. అమ్మమ్మ సుచిత్రాసేన్ , తల్లి మున్ మున్ సేన్ బాటలో హీరోయిన్ గా పరిచయమైన రియాసేన్.. తాను బాలీవుడ్ సినిమాలు మానేయడానికి గల కారణాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. పదహారేళ్ల వయసుకే ఓ మ్యూజిక్ వీడియోతో బ్రేక్ అందుకున్న రియాసేన్.. ఆ తర్వాత వరుస బాలీవుడ్ సినిమాలతో బిజీ అయిపోయింది. కెరీర్ ప్రారంభంలో వరుస కమర్షియల్ సక్సెస్‌లు రావడంతో తనది కరెక్ట్ చాయిస్ అని ఫీలైంది. కానీ అంత చిన్న వయసులోనే బోల్డ్ అండ్ సెక్సీ హీరోయిన్ అనే ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోయింది. దీంతో తనని తెరపై చూసిన భావనతోనే బయట కూడా ట్రీట్ చేసేవాళ్లట. అదీకాక తనకు నటన రాదని కూడా విమర్శలొచ్చాయని చెప్పింది రియాసేన్. హీరోయిన్ గ్లామరస్ గా ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు కనుక తాను ఎవరినీ తప్పుపట్టడం లేదన్న రియాసేన్, చిన్న వయసులోనే హీరోయిన్ కావడంతో వరుస స్టీరియోటైప్ గ్లామర్ రోల్స్‌లో నటించడం ఇబ్బందిగా, నెర్వస్‌గా అనిపించేదని, అందుకే బాలీవుడ్ సినిమాలు మానేశానని క్లారిటీ ఇచ్చింది. అయితే తాను హిందీ లో మానేయడం వల్ల మంచే జరిగిందట. ఆమె ప్రతిభకి తగ్గ పాత్రలు బెంగాలీలో దక్కాయట. అక్కడా గ్లామర్ రోల్స్ చేసినా ఇక్కడ జరిగింది వేరు అని, తనలోని బలాబలాలను బాలీవుడ్ దర్శకులు గుర్తించలేకపోయారని చురక అంటించింది. గత మూడేళ్లుగా వెబ్ సిరీసులపై దృష్టి సారించిన రియా.. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో మరెన్నో ఛాలెంజింగ్ రోల్స్ చేయాలని ఉందంటోంది. అయితే రియా సౌత్ లోనూ నటించిందన్న విషయం చాలామందికి గుర్తుండకపోవచ్చు. మలయాళంలో ‘అనంతభద్రమ్’ అనే సినిమా చేసిన ఆమె.. తెలుగులో ‘నేను మీకు తెలుసా’లో మంచు మనోజ్‌తో జోడీ కట్టింది.
