15 పాయింట్ల ఫార్మాట్ పెద్ద మార్పు కాదు.. బ్యాడ్మింటన్ క్రీడాకారుడు చిరాగ్ శెట్టి

15 పాయింట్ల ఫార్మాట్ పెద్ద మార్పు కాదు.. బ్యాడ్మింటన్ క్రీడాకారుడు చిరాగ్ శెట్టి

న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్​లో కొత్తగా ప్రవేశపెట్టనున్న 15 పాయింట్ల ఫార్మాట్ 21 పాయింట్ల పద్ధతి కంటే భిన్నంగా లేదని డబుల్స్ క్రీడాకారుడు చిరాగ్ శెట్టి వ్యాఖ్యానించాడు. ఈ కొత్త పద్ధతి ఆటను వేగం, శక్తి వైపు మళ్లిస్తుందని అభిప్రాయపడ్డాడు. డెన్మార్క్‌‌‌‌లో జరిగిన బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ వార్షిక సమావేశంలో 15x3 పాయింట్ల విధానాన్ని ఆమోదించారు. 

అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీ ఓట్లతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2027 జనవరి 4 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. ఈ మార్పుపై భారత క్రీడాకారులు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. గతంలో 11 పాయింట్ల ఫార్మాట్ చూశానని, 15 పాయింట్ల విధానం పెద్ద మార్పు కాదని చిరాగ్ అన్నాడు. మంగళవారం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 

11x5 గేమ్స్ చాలా వేగంగా ఉండేవని, పుంజుకోవడానికి సమయం దొరికేది కాదన్నాడు.15 పాయింట్ల ఫార్మాట్ 21 పాయింట్ల విధానానికి దగ్గరగా ఉంటుందని చెప్పాడు. శక్తివంతమైన స్మాషర్లు, వేగంగా ఆడే క్రీడాకారులకు ఈ ఫార్మాట్ కలిసొస్తుందని చెప్పాడు. 21 పాయింట్ల సుదీర్ఘ మ్యాచ్‌‌‌‌లలో శక్తిని నిలబెట్టుకోవడం కష్టమని, 15 పాయింట్ల ఆటలో శరీరం త్వరగా అలసిపోదని, కానీ ప్రేక్షకులకు ఈ ఆట ఉత్సాహం ఇస్తుందో లేదో వచ్చే కొన్ని నెలల్లో తెలుస్తుందని చెప్పాడు.