ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ వర్సెస్ బీజేపీ

ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ వర్సెస్ బీజేపీ

ఢిల్లీలో ఆప్‌, బీజేపీ మధ్య రాజకీయ రగడ నెలకొంది. ఒకరిపై మరొకరు విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనాపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు చేసింది. వీటిపై విచారణ జరపాలని డిమాండ్‌ చేస్తూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు సోమవారం రాత్రి నుంచి అసెంబ్లీలోనే నిరసనకు దిగారు. అయితే ఆమ్‌ ఆద్మీ పార్టీకి కౌంటర్‌గా బీజేపీ ఎమ్మెల్యేలు కూడా శాసనసభా ప్రాంగణంలో ఆందోళన చేపట్టారు. దీంతో ఢిల్లీ అసెంబ్లీలో అర్ధరాత్రి హైడ్రామా నెలకొంది.

బీజేపీ ఆరోపణలను తిప్పికొట్టేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సోమవారం శాసనసభలో సొంత ప్రభుత్వంపైనే విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనాపై ఆప్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. 2016లో జరిగిన నోట్ల రద్దు సమయంలో ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్‌ ఛైర్మన్‌గా ఉన్న సక్సేనా.. తన ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడి తెచ్చి రూ.1400 కోట్ల విలువైన పాత నోట్లను మార్పిడి చేయించారని ఆప్‌ ఎమ్మెల్యే దుర్గేశ్‌ పాఠక్‌ ఆరోపించారు. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తూ ఆప్‌ ఎమ్మెల్యేలు రాత్రంతా శాసనసభ ప్రాంగణంలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. గాంధీ విగ్రహం వద్ద ఆప్‌ ఎమ్మెల్యేలు ప్లకార్డులు చేతబట్టి ఆందోళనలు చేశారు. రాత్రి అసెంబ్లీ ప్రాంగణంలోనే ఎమ్మెల్యేలు నిద్రించారు.

మా ఎమ్మెల్యేలు మంచోళ్లు..అమ్ముడుపోరు
ఆప్ ఎమ్మెల్యేలు నిజాయితీపరులని, అమ్ముడుపోయేటోళ్లు కాదని ఆ పార్టీ చీఫ్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ అన్నారు. సోమవారం ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఢిల్లీలో బీజేపీ చేపట్టిన ‘ఆపరేషన్ లోటస్’ ఫెయిల్ అయిందని, తమ ఎమ్మెల్యేలంతా కరుడుగట్టిన నిజాయతీపరులని చాటి చెప్పేందుకే విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినట్లు కేజ్రీవాల్ వెల్లడించారు. ‘‘మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల్లో ఆపరేషన్ లోటస్ సక్సెస్ అయి ఉండొచ్చు. కానీ ఢిల్లీలో మాత్రం అది ఫెయిల్ అయింది” అని ఆయన అన్నారు. కొన్ని రాష్ట్రాల్లో రూ. 50 కోట్ల చొప్పున ఇచ్చి కూడా ఎమ్మెల్యేలను కొన్నారని ఆరోపించారు. వచ్చే 15 రోజుల్లో జార్ఖండ్ సర్కారును కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఆ తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలను మళ్లీ పెంచుతారని, అప్పుడు తమ డబ్బు ఎక్కడికెళ్తోందో ప్రజలకు అర్థం అవుతుందన్నారు. 

ప్రజలకు పన్నులు.. బిలియనీర్లకు మాఫీలు 
‘‘ప్రజల ద్వారా ఇలా ట్యాక్స్ లు వసూలు చేస్తూ.. ఆ డబ్బును వాళ్ల బిలియనీర్ దోస్తుల లోన్ లు మాఫీ చేసేందుకు వాడుతున్నారు. కేంద్రం తన బిలియనీర్ దోస్తులకు మాఫీ చేసిన లోన్ లను తిరిగి వసూలు చేస్తే దేశంలో ధరల సమస్య పరిష్కారం అవుతుంది” అని కేజ్రీవాల్ అన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు అత్యంత అవినీతి ప్రభుత్వమని మండిపడ్డారు. ఢిల్లీ బడుల్లో ఎక్కువ టాయిలెట్లను కట్టడంలోనూ స్కాం జరిగిందన్న ఆరోపణలను ఖండించారు. కేజ్రీవాల్ ప్రసంగం తర్వాత సభ మంగళవారానికి వాయిదా పడింది. 

బీజేపీ ఎమ్మెల్యేలను బయటకు పంపి..   
సభలో సోమవారం సమావేశాలు ప్రారంభం కాగానే ఎక్సైజ్ పాలసీ, ఇతర అంశాలపై చర్చ చేపట్టాలంటూ బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. ఢిల్లీ బడుల్లో క్లాస్ రూంల నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) ఇచ్చిన రిపోర్ట్ పైనా చర్చకు పట్టుబట్టారు. అయితే, సీరియస్ ఇష్యూస్ పై చర్చకు అసెంబ్లీ సమావేశం అయిందని, కానీ ప్రతిపక్ష బీజేపీ సభ్యులు అడ్డుకుంటున్నారంటూ డిప్యూటీ స్పీకర్ రాఖీ బిర్లా అసహనం వ్యక్తం చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలను మార్షల్స్ ద్వారా బలవంతంగా బయటకు పంపించారు. ఆ తర్వాత సీఎం అర్వింద్​ కేజ్రీవాల్ సభలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు.