ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తోంది

ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తోంది

బీజేపీపై పంజాబ్‌ ఆర్థిక మంత్రి హర్‌పాల్‌ సింగ్‌ చీమా ఆరోపణలు

చండీగఢ్‌ : పంజాబ్‌లో భగవంత్‌ మాన్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందంటూ ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఇవే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. పార్టీ మారాలంటూ దాదాపు 10 మంది ఆప్‌ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.20 నుంచి రూ.25కోట్లు చొప్పున బీజేపీ నేతలు ఆఫర్‌ చేశారంటూ పంజాబ్‌ ఆర్థికశాఖ మంత్రి హర్‌పాల్‌ సింగ్‌ చీమా ఆరోపించారు. ‘ఆపరేషన్‌ కమలం’లో భాగంగా కొందరు బీజేపీ నేతలు ఆప్‌ ఎమ్మెల్యేలను సంప్రదించినట్టు తెలిపారు. ఏడుగురు నుంచి పది మంది ఆప్‌ ఎమ్మెల్యేలకు డబ్బు, మంత్రి పదవులు ఆఫర్‌ చేశారన్నారు. 

చండీగఢ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్థికశాఖ మంత్రి హర్‌పాల్‌ సింగ్‌ చీమా మాట్లాడారు. ‘పంజాబ్‌లోని ఆప్‌ ఎమ్మెల్యేల్లో చీలిక తీసుకువచ్చేందుకు బీజేపీ కేంద్ర నాయకత్వం పంపిన కొందరు నేతలు మా ఎమ్మెల్యేలను ఫోన్‌లో సంప్రదించారు. ఢిల్లీలోని అగ్ర నేతలతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. ఒక్కొక్కరికి రూ.25 కోట్లు చొప్పున ఆఫర్‌ చేశారు. ఒకవేళ తమ వెంట వేరే ఎమ్మెల్యేలను తీసుకొస్తే అదనంగా డబ్బు కూడా ఇస్తామని చెప్పారు’ అని  హర్‌పాల్‌ సింగ్‌ చీమా ఆరోపించారు.

గతంలో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకొని చేసిన ఇలాంటి ప్రయత్నమే విఫలమైందని, ఇప్పుడు కూడా పంజాబ్‌లో ఆప్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మంత్రి హర్‌పాల్‌ సింగ్‌ చీమా మండిపడ్డారు. గత వారం రోజులుగా నిరంతరం ఈ ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు. బీజేపీ నేతలు ఏడుగురు నుంచి పది మంది వరకు తమ ఎమ్మెల్యేలను సంప్రదించారన్న మంత్రి చీమా.. ఎవరెవరికి ఈ ఆఫర్‌ చేశారనే విషయాలను మాత్రం చెప్పేందుకు నిరాకరించారు. దీనికి సంబంధించిన ఆధారాలను సరైన సమయంలో బయటపెడతామన్నారు.