- కోర్టుకు విన్నవించిన సమత హత్య కేసు నిందితులు
- శుక్రవారానికి విచారణ వాయిదా
ఆదిలాబాద్ అర్బన్, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ లో సమత అత్యాచారం, హత్య ఘటనతో తమకు సంబంధం లేదని నిందితులు కోర్టుకు పేర్కొన్నారు. కేసులోని నిందితులు షేక్ బాబా, షేక్ షాబోద్దీన్, షేక్ మగ్దూంలను పోలీసులు నాలుగో రోజు ప్రత్యేక కోర్టు ఎదుట హాజరు పరిచారు. విచారణ సందర్భంగా కోర్టు ఈ నేరం మీరే చేశారా అని నిందితులను ప్రశ్నించింది. ఈ నేరానికి, తమకు ఎలాంటి సంబంధం లేదని, తాము నేరం చేయలేదని నిందితులు కోర్టుకు విన్నవించారు. నిందితులతో మాట్లాడేందుకు తనకు అవకాశం కల్పించాలని వారి తరఫున వాదనలు విన్పిస్తున్న అడ్వకేట్ రహీం కోరగా అందుకు కోర్టు అంగీకరించింది. దీంతో ఓ ప్రత్యేక గదిలో అడ్వకేట్ ఆ ముగ్గురు నిందితులతో మాట్లాడి కేసు వివరాలను తెలుసుకున్నారు. అనంతరం తన క్లైంట్లు ఈ నేరం చేయలేదని పేర్కొంటూ కేసు డిశ్చార్జ్చేయాలంటూ కోర్టుకు నివేదించారు. వారు నేరం చేసినట్లుగా ఎలాంటి సైంటిఫిక్ ఆధారాలు, సాక్ష్యాలు లేవని, పోలీసులు ఊహాజనిత ఆధారాలతో చార్జిషీట్ దాఖలు చేశారని పేర్కొన్నారు. నిందితుల తరఫు అడ్వకేట్ వాదనలను విన్న కోర్టు కేసు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

