చిన్నారి రమ్య ఘటనలో నిందితులకు శిక్ష పడాలి

చిన్నారి రమ్య ఘటనలో నిందితులకు శిక్ష పడాలి

పంజాగుట్టలో జరిగిన రోడ్డు ప్రమాదం ఘటనలో తమకు ఇంత వరకు న్యాయం జరగడం లేదని మృతి చెందిన చిన్నారి రమ్య తల్లిదండ్రులు వెంకటరమణ, రాధికలు ఆరోపించారు. 2016లో ప్రమాదం జరిగినప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా సత్వర న్యాయం చేస్తాం అని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రజా ప్రతినిధులు ఇచ్చిన హామీలను ఎవరు కూడా నెరవేర్చలేదని తెలిపారు. నిందితులు డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేస్తూ కేస్ నుంచి తప్పించుకుంటున్నారన్నారు. A2 నిందితుడు అలాగే తప్పించుకున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు పోలీసులు కౌంటర్ పిటిషన్ వెయ్యలేదన్నారు. A3 కూడా డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేసినట్లు..ఈరోజు కోర్టు తీర్పు ఇవ్వాల్సి ఉందన్నారు. విచారణ అధికారులు, న్యాయ నిపుణులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నట్లు, ఇప్పటికైనా ప్రభుత్వం, పోలీసు అధికారులు స్పందించి తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. 

2016 జులై 01న హైదరాబాద్ నాగార్జున సర్కిల్ సమీపంలో తప్పతాగి అతి వేగంగా కారు నడుపుతుండగా అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టింది. అదే వేగంతో ఎగిరి అటు వైపు వస్తున్న రమ్య కుటుంబం ప్రయాణిస్తున్న కారుపై పడింది. 9 ఏళ్లకే రమ్యకు నూరేళ్లు నిండాయి. రమ్య తాతయ్య, బాబాయి దుర్మరణం చెందారు. తల్లి, మరో బాబాయికి తీవ్రగాయాలయ్యాయి. రాష్ట్రంలో ఈ ఘటన సంచలనం సృష్టించింది. రమ్య జ్ఞాపకాలు ఇప్పటికీ మమ్మల్ని వెంటాడుతున్నట్లు, తమకు తీరని అన్యాయం జరిగిందని తల్లిదండ్రులు వెల్లడిస్తున్నారు. నిందితులకు శిక్ష పడాల్సిందేనని వారు డిమాండ్ చేస్తున్నారు.