Prabhas: ప్రభాస్ది బాహుబలి హృదయం.. ఫిష్ వెంకట్ కిడ్నీ మార్పిడికి రూ.50 లక్షల సాయం!

Prabhas: ప్రభాస్ది బాహుబలి హృదయం.. ఫిష్ వెంకట్ కిడ్నీ మార్పిడికి రూ.50 లక్షల సాయం!

టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ ప్రస్తుతం ఐసియులో ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఫిష్ వెంకట్ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా.. రెబల్ స్టార్ ప్రభాస్ సాయం చేయడానికి ముందుకొచ్చాడు. అతనికి కిడ్నీ మార్పిడి అత్యవసరం అని కుటుంబ సభ్యులు చెప్పడంతో.. ఆపరేషన్‌కు కావాల్సిన 50 లక్షల రూపాయలను ఏర్పాటు చేస్తానని ప్రభాస్ హామీ ఇచ్చాడు. 
 
ఈ క్రమంలో ఫిష్ వెంకట్ కూతురు స్రవంతి ప్రముఖ మీడియాతో మాట్లాడి వివరాలు పంచుకుంది. హీరో ప్రభాస్ బృందం తనకు ఆర్థిక సహాయం అందించిందని వెల్లడించింది. ప్రభాస్‌ అసిస్టెంట్‌ కాల్‌ చేసి 'కిడ్నీ ఇచ్చే డోనర్‌ (దాత) ఉంటే  ఏర్పాట్లు చేసుకోండి. ఆపరేషన్‌కు కావాల్సిన డబ్బు ఏర్పాటు చేస్తాం' అని హామీ ఇచ్చారని మీడియాతో తెలిపింది. ఈ క్రమంలో తన తండ్రి పరిస్థితి విషమంగా ఉండటంతో ముందుకొచ్చిన ప్రభాస్ కు కృతజ్ఞతలు వెల్లడించింది.

అలాగే, ఇతర టాలీవుడ్ అగ్ర తారల సహాయాన్ని కూడా ఆమె అభ్యర్థించారు. అయితే, స్రవంతి కిడ్నీ దాతను కనుగొనడంలో ఉన్న సవాలును సినీ ఇండస్ట్రీ పెద్దల దృష్టికి తీసుకొచ్చింది. వివిధ కారణాల వల్ల కుటుంబ సభ్యుల కిడ్నీదానం చేయలేకపోతున్నారని తెలిపింది. 

►ALSO READ | Thammudu Box Office: ఫస్ట్ డే తమ్ముడుకు దారుణమైన కలెక్షన్స్

స్రవంతి మాట్లాడుతూ.. "నాన్న ఆరోగ్యం అస్సలు బాలేదు. ఆయన చాలా సీరియస్‌గా ఉన్నారు, ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు కిడ్నీ మార్పిడి అవసరం. దీనికి కనీసం రూ. 50 లక్షలు ఖర్చవుతుంది. ప్రభాస్ పీఆర్ టీమ్ నుండి మాకు ఫోన్ వచ్చింది. వారు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు. ఆపరేషన్ జరిగినప్పుడు ఖర్చు భరించడానికి తమకు తెలియజేయమని అడిగారు" అని ఆమె వివరించారు.

"చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ అయినా, మా నాన్నగారికి దాతను కనుగొనడంలో వారు మాకు సహాయం చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఆయన వారందరితో కలిసి చాలా మంచి సినిమాల్లో పనిచేశారు. ఇప్పుడు ఎవరూ ఆయన గురించి పట్టించుకోనట్లు కనిపిస్తోంది. దయచేసి అందరూ నాన్నగారికి సహాయం చేయాలని నేను అభ్యర్థిస్తున్నాను" అని ఆమె అన్నారు. మరి మిగతా టాలీవుడ్ హీరోల్లో ఎవరైనా ముందుకొస్తారా? లేదా? అనేది చూడాలి.

ఫిష్ వెంకట్ తనదైన శైలిలో హాస్యంతో పాటు విలన్గా నటించి టాలీవుడ్‌లో ప్రసిద్ధి చెందాడు. తన బలమైన తెలంగాణ మాండలికం కారణంగా 'ఫిష్' అనే మారుపేరును సంపాదించాడు. దిల్‌, బన్నీ, అదుర్స్, ఢీ, గబ్బర్ సింగ్,  నాయక్‌, అత్తారింటికి దారేది, డీజే టిల్లు వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు.