
- జోగులాంబ రేంజ్ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: పోలీసుల నైపుణ్యాన్ని మెరుగు పరిచేందుకే డ్యూటీ మీట్ ఏర్పాటు చేసినట్లు డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ తెలిపారు. పట్టణంలో రెండు రోజుల పాటు నిర్వహించిన డ్యూటీ మీట్ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని వివిధ విభాగాలకు చెందిన పోలీస్ అధికారులు, సిబ్బందికి వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. క్రైం ఇన్వెస్టిగేషన్, సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ కు నైపుణ్యం ఉపయోగపడుతుందన్నారు.
క్రిమినల్స్ చట్టం నుంచి తప్పించుకోకుండా ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని చెప్పారు. ఈ మీట్లో ప్రతిభ చూపిన వారిని స్టేట్ మీట్ కు, నేషనల్ మీట్ కు పంపిస్తామని తెలిపారు. ప్రతిభ చూపిన వారికి మెడల్స్, ట్రోఫీలు, ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. ఎస్పీలు గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, డి జానకి, యోగేశ్ గౌతమ్, గిరిధర్, అడిషనల్ ఎస్పీ సీహెచ్ రామేశ్వరరావు పాల్గొన్నారు.
గద్వాల పోలీసులకు 12 మెడల్స్..
గద్వాల: నాగర్కర్నూల్లో జరిగిన పోలీస్ డ్యూటీ మీట్లో జోగులాంబ గద్వాల జిల్లాకు 12 మెడల్స్ వచ్చినట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. మూడు గోల్డ్, ఆరు సిల్వర్, మూడు బ్రాంజ్ మెడల్స్ సాధించినట్లు చెప్పారు. మెడల్స్ సాధించిన పోలీస్ ఆఫీసర్లను ఎస్పీ అభినందించారు.