
Jane Street: అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఇన్వెస్ట్మెంట్ సంస్థ జేన్ స్ట్రీట్ కార్యకాలాపాలను మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఇండియాలో నిషేధించింది. అక్రమ పద్ధతుల ద్వారా మార్కెట్లను తారుమారు చేసి వేల కోట్ల లాభాలను కంపెనీ కొల్లగొట్టిందని.. ఇది భారత పెట్టుబడిదారులకు భారీ నష్టాలను తెచ్చిందని దర్యాప్తులో సెబీ గుర్తించింది. అయితే అసలు జేన్ స్ట్రీ్ట్ భారత మార్కెట్లనే ఎందుకు ఎంచుకుంది.. 2020 తర్వాత భారత మార్కెట్లోకి ఎందుకు ఎంట్రీ ఇచ్చిందనే ప్రశ్నలకు ఐఐఎం పూర్వ విద్యార్థి లోకేష్ అహుజా సమాధానం ఇచ్చారు.
2019 నుంచి 2024 మధ్య కాలంలో భారత స్టాక్ మార్కెట్లలో డెరివేటివ్ ట్రేడింగ్ ఏకంగా 40 రెట్లు పెరుగుదలను చూసింది. దీనికి ఒక ప్రధాన కారణం కరోనా కాలం నుంచి రిటైల్ పెట్టుబడిదారుల సంఖ్య భారీగా పెరగటమే. 2018లో డెరివేటివ్ ట్రేడింగ్ మెుత్తంలో రిటైల్ ఇన్వెస్టర్లు కేవలం 2 శాతంగా ఉండేవారు. కానీ 2024 వచ్చేసరికి వీరి సంఖ్య 820 రెట్లు పెరిగి 41 శాతానికి చేరుకుంది. ఇదే కాలంలో ట్రేడింగ్ అకౌంట్ల సంఖ్య 3.6 కోట్ల నుంచి 15 కోట్లకు అమాంతం పెరగటం పెద్ద మార్పులకు కారణమైంది. ఇంటర్నెట్, సోషల్ ఇన్ ఫ్ల్యూయన్సర్ల ప్రభావం కూడా దీనికి కారణంగా మారింది.
2020లో స్టాక్ మార్కెట్లలో వారం వారీ ఆప్షన్స్ ప్రవేశపెట్టడం.. పెద్ద సంఖ్యలో పెట్టుబడిదారులు ఉండటం, తక్కువ పెట్టుబడితో అవి అందుబాటులో ఉండటం వంటి అనేక కారణాలు వాటిని పాపులర్ చేశాయి. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకునే అనేక అంతర్జాతీయ పెట్టుబడి సంస్థలు భారత డెరివేటివ్ మార్కెట్లలోకి ఎంట్రీ ఇచ్చాయి. పైగా ఇక్కడ మార్కెట్లలో ట్రేడర్లు చాట్ ప్యాట్రన్లను, టెక్నికల్స్ ఫాలో అవటం గమనించిన సదరు సంస్థలు తమ హై ఫ్వీక్వెన్సీ ట్రేడింగ్, అల్గారిథం ట్రేడింగ్ వ్యూహాలతో భారత డెరివేటివ్ మార్కెట్లలో ఆట మెుదలెట్టాయని తేలింది.
►ALSO READ | Gold Rate: తొలి ఏకాదశకి గోల్డ్ షాపింగ్ చేస్తున్నారా.. హైదరాబాదులో రేట్లివే..
వాస్తవానికి జేన్ స్ట్రీట్ సంస్థ 2024 ఒక్క సంవత్సరంలోనే భారత మార్కెట్లలో ట్రేడింగ్ నుంచి రూ.19వేల 500 కోట్లు సంపాదించింది. ఒక విధంగా చెప్పాలంటే బిస్కెట్ల వ్యాపారంలో ఉన్న బ్రిటానియా ఏడాది మెుత్తం అమ్మకాల విలువ రూ.17వేల కోట్ల కంటే ఇది ఎక్కువ. బ్రిటానియావి కేవలం అమ్మకాలే లాభం కాదు. అంటే బ్రిటానియా సంస్థ మాదిరిగా ఒక్క బిస్కెట్ కూడా అమ్మకుండానే జేన్ స్ట్రీట్ రూ.19వేల కోట్ల కంటే ఎక్కువ డబ్బు సంపాదించటం ఆశ్చర్యకరంగా ఉందని అహుజా అన్నారు.
భారత స్టాక్ మార్కెట్లు చాలా పెద్దది. ఇక్కడ వేగంగా ఆట ఆడేవాళ్లకే లాభాలు ఉంటాయి. అందుకే అల్గారిథం వాడి హై ఫ్వీక్వెన్సీ ట్రేడింగ్ చేసే పెద్దపెద్ద ఆటగాళ్లు భారత మార్కెట్లను విడవకుండా కొనసాగటానికి ఇదొక కారణంగా నిపుణులు చెబుతున్నారు. ఎంత ఎక్కువ మంది రిటైల్ ఇన్వెస్టర్లు నష్టాలను చూస్తే పెద్ద ఇన్వెస్టర్లకు అంత ఎక్కువగా లాభాలు వస్తాయి. ఇందుకోసం వారు తమ వద్ద ఉన్న డబ్బును భారీగా ట్రేడింగ్ కోసం ఉపయోగిస్తూ మార్కెట్లను తమకు కావాల్సిన దిశలో మారేందుకు ట్రేడ్స్ చేస్తుంటారు జేన్ స్ట్రీట్ ఉదంతం బయటపెట్టింది.