
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. వివాహ బృందంతో వెళ్తున్న బొలెరో వాహనం అదుపుత తప్పి ఓ కాలేజ్ ప్రహరి గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నవ వరుడు సహా ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. జెవానై గ్రామంలో శనివారం (జూలై 5) ఉదయం 6:30 గంటల ప్రాంతంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. అధిక వేగం, వాహన పరిమితికి మించి ప్రయాణించడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
జిల్లా అదనపు ఎస్పీ అనుకృతి శర్మ వివరాల ప్రకారం.. సంభాల్‌లోని హర్ గోవింద్‌పూర్ గ్రామం నుంచి బుడాన్ జిల్లా సిర్టౌల్‌లోని వధువు గ్రామానికి వరుడి తరుఫు బంధువులు బొలెరా వాహనంలో బయలుదేరారు. జెవానై గ్రామంలోని జనతా ఇంటర్ కాలేజీ సమీపంలో బొలెరో వాహనం అదుపు తప్పి కళాశాల ప్రహరి గోడను ఢీకొట్టి బోల్తా పడింది.
ప్రమాద సమయంలో వాహనంలో మొత్తం 10 మంది ఉన్నారు. అందులో ఐదుగురు అక్కడికక్కడే ఘటన స్థలంలోనే మరణించారు. మరో ముగ్గురు చికిత్స పొందుతూ ఆసుపత్రిలో చనిపోయారు. ఇద్దరు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారని తెలిపారు. మృతుల్లో వరుడు సూరజ్ (24), వరుడి వదిన ఆశా (26), ఆశా కుమార్తె ఐశ్వర్య (2), మనోజ్ కుమారుడు విష్ణు (6), వరుడి అత్త, ఇద్దరు మైనర్లు సహా మరో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని వెల్లడించారు.
వాహన పరిమితికి మించి ప్రయాణించడంతోనే ప్రమాదంలో మృతుల సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కాళ్ల పారాణి కూడా ఆరక ముందే నవ వరుడు మృతి చెందడంతో పెళ్లింట విషాదచాయలు అలుముకున్నాయి. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు .