ఝరాసంగం, వెలుగు: పరిహారం చెల్లించాకే పనులు చేసుకోవాలని బాధిత రైతులు డిమాండ్ చేశారు. జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి (నిమ్జ్)లో పరిశ్రమల స్థాపనకు రైతుల నుంచి సేకరించిన భూమిలో మౌలిక వసతుల కల్పనకు ఎస్ఆర్ఆర్ప్రైవేట్సంస్థ కాంట్రాక్ట్ పొందిన విషయం తెలిసిందే. ఇప్పటికే భూమిపూజ సైతం చేసింది. ఇందులో భాగంగా బుధవారం సదరు సంస్థ ఎల్గోయి గ్రామ శివారులో జేసీబీతో రోడ్డునిర్మాణానికి పనులు చేపట్టింది. గ్రామ రైతులు వెళ్లి జేసీబీని అడ్డుకొని పనులు నిలిపి వేశారు. వారు మాట్లాడుతూ ఇప్పటికే రైతుల నుంచి దాదాపు 1800 ఎకరాల వ్యవసాయ భూములను ప్రభుత్వం సేకరించిందన్నారు. కానీ.. తమకు నేటికీ పునరావాసం కల్పించలేదన్నారు. సర్వే నంబర్ 54,125లోని భూముల 30 రైతులకు నష్టపరిహారం చెల్లింపులో నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదని వ్యక్తం చేశారు. కోర్టులో కేసు నడుస్తుందని, తమకు న్యాయం జరిగే వరకు పనులు చేపట్ట వద్దని రైతులు హెచ్చరించారు. పంచాయతీ అనుమతి తీసుకోకుండా పనులను ఎలా చేస్తారని రైతులు ప్రశ్నించారు.
