రివర్‌ లింకింగ్‌ ప్రాజెక్టుపై ఏపీ జెట్ స్పీడ్

రివర్‌ లింకింగ్‌ ప్రాజెక్టుపై  ఏపీ జెట్ స్పీడ్

హైదరాబాద్‌, వెలుగుగోదావరి నీళ్లను కృష్ణా, పెన్నా బేసిన్లకు తరలించే ప్రాజెక్టు పనులు మొదలు పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. పోలవరం కుడి కాలవను విస్తరించి నీళ్లను మళ్లించే రాయలసీమ డ్రాట్‌ మిటిగేషన్‌ ప్రాజెక్టు కోసం కార్పొరేషన్‌ ఏర్పాటు చేసింది. బుధవారం జరిగిన కేబినెట్ మీటింగ్ లో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ’ఏపీ రాయలసీమ డ్రాట్‌ మిటిగేషన్‌ ప్రాజెక్టు కార్పొరేషన్‌ లిమిటెడ్‌‘ను ఏర్పాటు చేస్తున్నట్టు ఏపీ మంత్రి పేర్ని నాని ప్రకటించారు. ఈ కార్పొరేషన్‌ ద్వారా బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రూ.40 వేల కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు.

జీవో 388 జారీ

పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ విస్తరణ, సంగమేశ్వరం లిఫ్ట్‌ ద్వారా ఎత్తిపోసే నీళ్లు చిత్తూరు జిల్లాలోని చివరి భూములకు తరలించేందుకు కొత్త పనులు చేపట్టడానికి ఏపీ కేబినెట్ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. గతంలో ఇచ్చిన జీవో నం.203కు కొనసాగింపుగా బుధవారం జీవో నం.388 జారీ చేసింది. రూ.1,415 కోట్లతో ఈ పనులు చేపట్టనున్నారు. పోతిరెడ్డిపాడు ఎస్కేప్‌ చానల్‌ జీరో పాయింట్‌ నుంచి బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌ మధ్య తూము నిప్పులవాగు, గాలేరు నది, కుందూ నది 189.2 కి.మీ.ల వరకు క్యారీయింగ్‌ కెపాసిటీని 35 వేల క్యూసెక్కులకు పెంచే పనులకు అనుమతులిచ్చారు. ఈ పనులకు టెండర్లు పిలవడం, ఇతర టెక్నికల్‌ పనులను త్వరలో మొదలు పెట్టనున్నారు. కాల్వలు, నది విస్తరణ చేపట్టే ప్రాంతాల్లో గ్రామాల రోడ్‌ కనెక్టివిటీకి బ్రిడ్జిలు, ప్రొటెక్షన్‌ వాల్స్‌ నిర్మాణాలు చేపట్టనున్నారు.

ఎన్‌జీటీ పర్మిషన్‌తో..

జీవో నం.203లో భాగంగా చేపట్టబోయే పనులకు సంబంధించిన టెండర్లు, ఇతర పనులు చేపట్టేందుకు ఎన్‌జీటీ పర్మిషన్‌ ఇవ్వడంతో ఏపీ ప్రభుత్వం ఈ ప్రక్రియను వేగవంతం చేసింది. మొదట కాల్వలు, వాగుల విస్తరణ టెండర్ల ప్రక్రియకు సంబంధించిన జీవో ఇవ్వగా రెండు, మూడు రోజుల్లో పోతిరెడ్డిపాడు విస్తరణ, సంగమేశ్వరం లిఫ్టు టెండర్ల ప్రక్రియ మొదలు పెట్టనున్నట్టు తెలిసింది.

కార్పొరేషన్‌తో మళ్లింపు పనులు ముమ్మరం

పోలవరం నుంచి చేపట్టే రివర్‌ లింకింగ్‌ ప్రాజెక్టుకు నిధుల సమస్య తలెత్తడంతో కార్పొరేషన్‌ ఏర్పాటు చేశారు. పోలవరం కుడి కాలువ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు, అక్కడి నుంచి నాగార్జునసాగర్‌ కుడి కాలువ, బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌ లింక్‌ పనులకు త్వరలోనే టెండర్లు పిలువనున్నారు. ప్రభుత్వం నుంచి కొద్ది మొత్తం నిధులతో పనులు మొదలు పెట్టి కార్పొరేషన్‌ ద్వారా తెచ్చే లోన్లతో లింకింగ్‌ ప్రాజెక్టు కంప్లీట్‌ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

మన రివర్‌ లింకింగ్‌కు మోక్షం దక్కలే

గోదావరి నీళ్లను కృష్ణా బేసిన్‌ మీదుగా పెన్నాకు లింక్‌ చేయాలని, తెలంగాణతో కలిసి ఈ ప్రాజెక్టును చేపట్టాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు సీఎం కేసీఆర్‌ సూచించారు. ఇద్దరు సీఎంలు మూడు సార్లు, రెండు రాష్ట్రాల ఇంజనీర్లు రెండు సార్లు భేటీ అయి నీళ్ల మళ్లింపు ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాథమిక అలైన్‌మెంట్లను సిద్ధం చేశారు. అయితే తెలంగాణ భూభాగం నుంచి నీళ్ల తరలింపును వద్దనుకున్న ఏపీ సీఎం జగన్‌.. పోలవరం నుంచి సొంతంగా మళ్లింపు పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియ కొన్ని రోజుల్లోనే టెండర్ల దశకు చేరుకుంది. తెలంగాణలో మాత్రం కృష్ణా నీళ్లు అందని ప్రాంతాలకు గోదావరి మళ్లింపు ప్రాజెక్టు చేపట్టాలనే ప్రతిపాదనకు ఇప్పటికీ మోక్షం దక్కలేదు.