కేటీఆర్  చెప్పినా జోగు రామన్న వినలే : ఎమ్మెల్యే పాయల్  శంకర్

కేటీఆర్  చెప్పినా జోగు రామన్న వినలే :  ఎమ్మెల్యే పాయల్  శంకర్
  • ఆదిలాబాద్​ ఎమ్మెల్యే పాయల్  శంకర్

ఆదిలాబాద్ టౌన్, వెలుగు: ఆదిలాబాద్ మున్సిపల్​ చైర్​పర్సన్​ ఎన్నికలో మద్దతు ఇవ్వాలని బీఆర్ఎస్  వర్కింగ్  ప్రెసిడెంట్  కేటీఆర్ కు తాను స్వయంగా ఫోన్  చేసి కోరానని, తప్పకుండా మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారని ఆదిలాబాద్​ ఎమ్మెల్యే పాయల్​ శంకర్ తెలిపారు. అయినప్పటికీ జోగు రామన్న కేటీఆర్  మాట వినకుండా కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చారని చెప్పారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ కు ఎట్టి పరిస్థితుల్లో మద్దతిచ్చేది లేదని కేటీఆర్ చెప్పారని, కానీ, జోగు రామన్న కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు కాబట్టే కేటీఆర్  మాట వినకుండా కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చారని విమర్శించారు.

గత మున్సిపల్  పాలకవర్గంలో తన కొడుకు చేసిన అవినీతిని బీజేపీ ఎక్కడ బయట పెడుతుందోననే భయంతో జోగు రామన్న బీజేపీకి మద్దతు ఇవ్వలేదన్నారు. తాను సీఎం రేవంత్ రెడ్డికి అమ్ముడు పోయానని జోగు రామన్న ఆరోపించాడని, తాను ఎవరికీ అమ్ముడుపోయే పరిస్థితిలో లేనన్నారు. జోగు రామన్న మాదిరిగా నీచ రాజకీయాలు చేయాల్సిన అవసరం తనకు లేదని, నీతి తప్పి రాజకీయాలు చేసిన అతడిని త్వరలో హిందువులు, ఆదిలాబాద్  ప్రజలు త్వరలో చీపుర్లతో కొట్టే రోజులు వస్తాయని హెచ్చరించారు. లాలా మున్నా, జోగు రవి, దోని జ్యోతి, హనుమాండ్లు, దినేశ్​ మటోలియా, శ్రీకాంత్, గంట జీవన్, రాకేశ్, సాయి, గోరక్, శివ, బండారి సంతోష్, పద్మ, భీంసేన్ రెడ్డి, సతీశ్, సూర్య పాల్గొన్నారు.