సైన్యం ఆగడాలను భరించలేక.. మయన్మార్​ నుంచి ఇండియాకు

సైన్యం ఆగడాలను భరించలేక.. మయన్మార్​ నుంచి ఇండియాకు

న్యూఢిల్లీ: మయన్మార్​లో సైనిక పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలపై జుంటా(ఆర్మీ) కఠినంగా వ్యవహరిస్తోంది.. అయినా సరే ఆందోళనలు ఆగడంలేదు. దీంతో నిరసనకారులపైకి సైన్యం తుపాకులు ఎక్కుపెట్టింది. బుధవారం సైన్యం జరిపిన కాల్పుల్లో 38 మంది చనిపోవడంతో కొన్నిచోట్ల ప్రజలు దేశం విడిచి పోతున్నారు. దీంతో కొంతమంది మన దేశంలోని మిజోరంలోకి అడుగుపెడుతున్నారు. సైన్యం ఆదేశాలను పాటించలేక కొంతమంది పోలీసులు కూడా పారిపోయి వస్తున్నారు. ఇప్పటిదాకా మన దేశంలోకి 30 మంది పోలీసులు వచ్చారని మిజోరం లోకల్​ పోలీసులు చెప్పారు. కుటుంబ సభ్యులతో పాటు వారు బార్డర్​ క్రాస్​ చేశారన్నారు. వారి పేర్లు, ఐడెంటిటీతో పాటు మయన్మార్​ నుంచి ఎందుకు పారిపోయి రావాల్సి వచ్చిందనే కారణలతో ఓ రిపోర్టు తయారుచేసి కేంద్రానికి పంపినట్లు వివరించారు. అక్రమంగా బార్డర్​ దాటొచ్చిన వాళ్లను గుర్తించేందుకు మిజోరం పోలీసులు ప్రజల సహకారం కోరుతున్నారు. తమ ఏరియాలో, గ్రామంలో కొత్తవాళ్లు కనిపిస్తే వెంటనే లోకల్​ పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెబుతున్నారు.

బార్డర్​లో గస్తీ పెంచిన మన ఆర్మీ

మయన్మార్​ ప్రజలు బార్డర్​ దాటి మిజోరంలో అడుగుపెడుతుండడంతో మన ఆర్మీ గస్తీ పెంచింది. ఇప్పుడు దేశంలోకి ఎవరినీ అనుమతించడంలేదని తెలిపింది. మిజోరం రాష్ట్రానికి మయన్మార్​తో దాదాపు 1600 కిలోమీటర్ల బార్డర్​ ఉంది. అటువైపు జరుగుతున్న హింస, అల్లర్ల నేపథ్యంలో జనం ప్రాణభయంతో బార్డర్​ దాటేందుకు ప్రయత్నిస్తున్నారు. శరణార్థులుగా తలదాచుకునేందుకు వస్తున్నారు.