ఎమ్మెల్యేల విచారణ మరింత స్పీడప్ : అసెంబ్లీ స్పీకర్

ఎమ్మెల్యేల విచారణ మరింత స్పీడప్ : అసెంబ్లీ స్పీకర్
  • నేడు, రేపు ఇద్దరి చొప్పున నలుగురు ఎమ్మెల్యేల ఎంక్వైరీ
  • దీంతో 8 మంది ఎమ్మెల్యేల  విచారణ పూర్తయినట్లే! 

హైదరాబాద్, వెలుగు: పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న10 మంది ఎమ్మెల్యేల విచారణను స్పీడప్​ చేయాలని అసెంబ్లీ స్పీకర్ నిర్ణయించారు. ఈ కేసు విచారణలో జాప్యంపై సోమవారం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. మరో 4 వారాల గడువు ఇవ్వడంతో ఈలోగా విచారణ పూర్తిచేయాలని స్పీకర్​ భావిస్తున్నట్టు తెలిసింది. 

ఈ క్రమంలోనే నేటి నుంచి రెండు రోజుల పాటు నలుగురు ఎమ్మెల్యేలను రెండో విడత విచారణకు పిలిచారు. బుధ, గురువారాల్లో అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో ఫిరాయింపులపై విచారణ జరగనుంది. బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ ను, మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ని విచారించనున్నారు. 

ఇక గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరక పోచారం శ్రీనివాస్ రెడ్డిని, మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అరికెపూడి గాంధీని విచారించనున్నారు. ఈ నలుగురు ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫు అడ్వకేట్లు స్పీకర్ సమక్షంలో క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు. వీరి విచారణతో మొత్తం 8 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తి అయినట్లే. 

నోటీసులకు స్పందించని దానం, కడియం.. 

స్పీకర్ ఇచ్చిన నోటీసులకు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి ఇంకా స్పందించలేదు. వీరిద్దరూ విచారణకు హాజరుకాకపోవడంతో వీరి విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ కొనసాగుతోంది.మరో వారం రోజుల్లోనే తుది తీర్పును స్పీకర్ వెల్లడించే అవకాశం ఉంది. 

స్పీకర్ తో సీఎం భేటీ

మంగళవారం అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ తో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మధ్యాహ్నం రెండున్నర గంటలటైంలో అసెంబ్లీకి వచ్చిన సీఎం.. నేరుగా స్పీకర్ కార్యాలయానికి వెళ్లారు. ఈ భేటీలో ఈ ఇద్దరితో పాటు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు ఉన్నారు. 

ఇప్పటివరకు విచారణ జరిగిన తీరు, వారి మధ్య చర్చకు వచ్చినట్టు తెలిసింది. రాబోయే రోజుల్లో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నది అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. అనంతరం అక్కడే లంచ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి మండలి ఏర్పాటు కోసం అసెంబ్లీలోని పాత భవనంలో కొనసాగుతున్న రెనోవేషన్​ పనులను పరిశీలించారు.  

శీతాకాల సమావేశాలు ఇక్కడే నిర్వహించేలా పనులను వెంటనే పూర్తి చేయాలని ఈ సందర్భంగా ఆర్ అండ్ బీ అధికారులను,  ఆగాఖాన్ ట్రస్టు ప్రతినిధులకు సీఎం సూచించారు.