
- నిందితులు ప్రతిపక్ష నాయకులకు సన్నిహితులే
- బీసీ పొలిటికల్ జేఎసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్
బషీర్ బాగ్, వెలుగు: వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర అధికారులపై కేటీఆర్ ప్రోద్బలంతోనే బీఆర్ఎస్ నాయకులు దాడి చేయించారని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ ఆరోపించారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో మంగళవారం ఆయన మాట్లాడారు. అధికారులపై ప్లాన్ ప్రకారమే దాడి జరిగిందన్నారు. రాజకీయాలకు అతీతంగా విధులు నిర్వర్తిస్తున్న అధికారులపై దాడి చేయడమంటే ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడిగానే పరిగణించాలన్నారు.
దాడి చేసి వారు ప్రతిపక్ష నాయకులకు సన్నిహితులు అని చెప్పారు. దోషులతోపాటు వారి వెనక ఉన్న బీఆర్ఎస్ పెద్దలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రజల దృష్టి మరల్చేందుకు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. కొడంగల్ సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం కావడంతో ఉద్యోగులను అడ్డం పెట్టుకొని రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ అనిశ్చితి సృష్టించాలని చూస్తున్నారన్నారు.
దాడికి పాల్పడిన సురేశ్ ఫోన్ నుంచి పట్నం నరేందర్ రెడ్డి, కేటీఆర్కు అనేకసార్లు ఫోన్ కాల్స్ వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జేఎసీ రాష్ట్ర కార్యదర్శి వివి గౌడ్, నాయకులు సాయిబాబా, రాఘవేందర్, నగేశ్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.