280 కోట్లు రిలీజ్​ చేసినా ఆ 19 చెరువులు బాగుపడలే

280 కోట్లు రిలీజ్​ చేసినా ఆ 19 చెరువులు బాగుపడలే
  • సిటీలో నిలిచిపోయిన అర్బన్ మిషన్​ కాకతీయ పనులు
  • సరూర్​నగర్ ​చెరువును మరో ట్యాంక్​బండ్ చేస్తనన్న 
  • సీఎం కేసీఆర్ ​హామీ ఏమాయె?
  • మురుగు నీరు చేరి ఎక్కడికక్కడ కంపు కొడుతున్న చెరువులు

ఎల్​బీనగర్, వెలుగు: అర్బన్​ మిషన్ కాకతీయ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన చెరువుల బ్యూటిఫికేషన్ ఎక్కడికక్కడ ఆగిపోయింది. సిటీలోని 19 చెరువులను డెవలప్​చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.280 కోట్లు రిలీజ్​చేసినప్పటికీ మూడేండ్లుగా సగం పనులు కూడా పూర్తికాలేదు. చెరువుల్లోకి డ్రైనేజీ నీళ్లు చేరకుండా చూడడంతోపాటు, చుట్టూ వాకింగ్​ట్రాకులు, బెంచీలు, ల్యాండ్​స్కేపింగ్, స్పెషల్​లైటింగ్ ఏర్పాటు చేయాలని భావించినా ఆ దిశగా పనులు సాగట్లేదు. కొన్నిచోట్ల చెరువులు కబ్జాకు గురవ్వగా, మిగిలిన చోట్ల కాంట్రాక్టర్స్, ఆఫీసర్ల నిర్లక్ష్యంతో డెవలప్​మెంట్​ఆగిపోయింది. 19 చెరువులపై 30 కేసులు ఉన్నట్లు ఇరిగేషన్ ఆఫీసర్లు చెబుతున్నారు. అభివృద్ధి చేద్దామంటే కేసులు అడ్డొస్తున్నాయని అంటున్నారు. మూడేండ్లుగా కేవలం 10 నుంచి 20 శాతం పనులు మాత్రమే పూర్తిచేశామని చెబుతున్నారు. కాగా కొన్నిచోట్ల బఫర్ జోన్, ఎఫ్​టీఎల్ కబ్జాకు గురవ్వడంతో చెరువులోనే పనులు చేస్తున్నారు. మన్సూరాబాద్ పెద్దచెరువులో నుంచి డ్రైనేజీ డైవర్షన్ ఏర్పాటు చేయడమే అందుకు నిదర్శనం.
చెప్పిందొకటి.. చేస్తుందొకటి
బ్యూటిఫికేషన్​లో భాగంగా చెరువుల్లోకి మురుగు నీరు కలవకుండా స్పెషల్​ట్రంక్​లైన్​ఏర్పాటు చేస్తామని ఆఫీసర్లు చెప్పారు. వాటిపేరుతో చెరువుల పరిధిలోని పెద్ద పెద్ద చెట్లను నరికివేశారు. కానీ ఆఫీసర్లు చెప్పిన దానికి క్షేత్రస్థాయిలో చేస్తున్న పనులకు సంబంధం ఉండట్లేదు. కొన్నిచోట్ల చేసిన పనులకు బిల్లులు రిలీజ్ కాక పనులు ఆపేసినట్లు కాంట్రాక్టర్లు చెబుతున్నారు. కొన్నిచోట్ల రిలీజ్​చేసిన ఫండ్స్​ను పూర్తిగా ఖర్చు చేయకుండా నామ మాత్రంగా పైపై మెరుగులు దిద్ది వదిలేశారు. అనుకున్న రీతిలో బ్యూటిఫికేషన్​జరగకపోగా చెరువుల్లోకి మురుగు నీరు చేరి కంపు కొడుతున్నాయి. 
నెరవేరని సీఎం హామీ
సరూర్ నగర్ చెరువు సిటీలోని పెద్ద చెరువుల్లో ఒకటి. నిజాం టైంలో 90 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు ప్రస్తుతం 58 ఎకరాలకు పరిమితమైంది. సీఎం కేసీఆర్​ఐదేండ్ల కింద సరూర్ నగర్ చెరువును సందర్శించారు. ఈ చెరువును మరో ట్యాంక్ బండ్ గా మారుస్తామని హామీ ఇచ్చారు. చెప్పి ఐదేండ్లు దాటిపోయినా ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి జరగలేదు. చెరువులోకి చేరుతున్న మురుగుతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. 
బైరామల్ గూడలోనూ అంతే..
బైరామల్ గూడ చెరువును డెవలప్ చేసేందుకు రూ.4.5కోట్లు మంజూరయ్యాయి. కానీ ఆఫీసర్లు మూడేండ్లుగా కేవలం 10 శాతం పనులను మాత్రమే పూర్తిచేశారు. 90 శాతం పనులు జరగాల్సి ఉంది. పనుల్లో భాగంగా ఇక్కడ బాక్స్ డ్రైనేజీ నిర్మాణం అస్తవ్యస్తంగా చేపట్టడంతో చెరువుకు సమీపంలోని ఎస్సీ బస్తీ, అంబేద్కర్ కాలనీ చిన్న వర్షం పడినా మునుగుతోంది. జీహెచ్ఎంపీ ఎలక్షన్​టైంలో మంత్రి కేటీ‌‌ఆర్ ఈ కాలనీల్లో పర్యటించారు. చెరువు పనులను త్వరగా పూర్తిచేసి ఇబ్బందులు లేకుండా చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ నేటికీ ఎలాంటి అభివృద్ధి జరగలేదు.  
ఇవే ఆ 19 చెరువులు
మియాపూర్ పటేల్​చెరువు,  హస్మత్​పేట చెరువు , రామంతాపూర్ పెద్ద చెరువు, మదీనగూడ పటేల్ చెరువు, గంగారం పెద్ద చెరువు, ప్రగతినగర్​లోని అంబీర్ చెరువు, ఉప్పరపల్లిలోని మల్కచెరువు , నెక్నాంపూర్​పెద్దచెరువు, చర్లపల్లి చెరువు, ఆర్కే పురంలోని ముక్కుడి చెరువు, కాప్రాలోని ఊర చెరువు, మన్సూరాబాద్ పెద్ద చెరువు, అంబర్ పేట్​లోని మోహిని చెరువు, ఉప్పల్​లోని నల్లచెరువు, జీడిమెట్ల చెరువు, సరూర్​నగర్ చెరువు, బండ్లగూడ చెరువు, నాగోలు చెరువు, బైరామల్ గూడ చెరువు.