మేడారం సంబురం ఆరంభం : అన్ని దారులు అమ్మల చెంతకే

మేడారం సంబురం ఆరంభం : అన్ని దారులు అమ్మల చెంతకే

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం మహాజాతరకు వేళయింది. తల్లి సారలమ్మ బుధవారం గద్దెకు చేరనుంది. గిరిజన పూజారులు తమ సాంప్రదాయ పద్ధతుల్లో సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను మేడారానికి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు చేస్తారు. అర్ధరాత్రి సమయంలో గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. సమ్మక్క తల్లిని గురువారం చిలుకల గుట్ట నుంచి తోడ్కొని వచ్చి గద్దెపై ప్రతిష్ఠిస్తారు.

మేడారం, వెలుగుమేడారం.. జనగుడారంగా మారిపోతోంది. గిరిజనుల ఆరాధ్య దైవం సమ్మక్క సారలమ్మ జాతర బుధవారం నుంచి మొదలవుతోంది. వనదేవతలను దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, చత్తీస్‌‌‌‌గఢ్‌‌ ‌‌రాష్ట్రాల నుంచి కూడా భక్తులు మేడారం చేరుకుంటున్నారు. మంగళవారం ఉదయం నుంచి అర్ధరాత్రి దాకా వాహనాలన్నీ ఎడతెరపి లేకుండా మేడారానికి వస్తూనే ఉన్నాయి.  పస్రా, తాడ్వాయి, కాటారం, చిన్నబోయినపల్లి రూట్లలో మేడారం వెళ్లడానికి వాహనాలకు పోలీసులు అనుమతులిచ్చారు. వీటిలో పస్రా రూట్‌‌‌‌లో ఎక్కువ వాహనాలు వస్తున్నాయి. రాష్ట్రంలోని 51 సెంటర్ల నుంచి మేడారానికి ఆర్టీసీ బస్సులను నడిపిస్తోంది. బస్సులు గద్దెల వరకు వస్తుండటంతో చాలామంది ఆర్టీసీ బస్సులలో ప్రయాణించడానికే మొగ్గు చూపారు. మేడారంలో  తాత్కాలికంగా ఏర్పాటుచేసిన బస్‌‌‌‌స్టేషన్‌‌ ‌‌మంగళవారం భక్తుల రాకతో కిటకిటలాడింది.

ఖాళీగా రెడ్డిగూడెం భూములు

మేడారం గద్దెలకు చాలా దగ్గరగా రెడ్డిగూడెం భూములు ఉంటాయి. సారలమ్మ రాకకు ముందే ఈ భూములు భక్తులు వేసుకున్న గుడారాలతో నిండిపోతుంటాయి. కానీ మంగళవారం పోలీసులు నార్లాపూర్‌‌‌‌ వద్దనే ప్రైవేట్‌‌‌‌ వాహనాలను ఆపేశారు. ఆర్టీసీ బస్సులలో వచ్చేవారు గుడారాలు వేసుకోరు. అమ్మవార్లకు మొక్కులు సమర్పించి అదే రోజు తిరిగి ఇంటికి వెళ్లిపోతారు. సుదూర ప్రాంతాల నుంచి ప్రైవేట్‌‌‌‌, సొంత వాహనాలు, వ్యాన్లు, మినీ వ్యాన్లు, ఆటోలలో వచ్చిన భక్తులు మాత్రమే గుడారాలు వేసుకుని మూడు రోజులపాటు మేడారంలో ఉంటారు. అయినా ఇలా వచ్చిన భక్తులు మేడారం చేరుకోకుండా ట్రాఫిక్‌‌‌‌ పేరిట పోలీసులు అడ్డుపడటం తీవ్ర విమర్శలకు దారి తీసింది.

మేడారానికి బైలెల్లిన పగిడిద్దరాజు.. శివసత్తుల పూనకాలతో దద్దరిల్లిన పూనుగొండ్ల

కొత్తగూడ(గంగారం), వెలుగు: సమ్మక్క భర్త పగిడిద్దరాజు మేడారం బైలెల్లాడు. మహబూబాబాద్​ జిల్లా గంగారం మండలంలోని పూనుగొండ్లలో పగిడిద్దరాజును పెళ్లికొడుకుగా ముస్తాబు చేసి మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు కాలినడకన పెనుక వంశానికి చెందిన పూజారులు మేడారానికి తరలివెళ్లారు. పూజారులు పెనుక మురళీధర్, బుచ్చిరాములు, సురేందర్, భిక్షపతి, పురుషోత్తంతో పాటు మరికొందరు ఉదయమే గుడిలో ప్రత్యేక పూజలు చేసి మేకను బలి ఇచ్చారు. అలయాన్ని శుద్ధి చేసి న తర్వాత పగిడిద్దరాజును కొత్త వస్ర్తం, గంటలతో అలంకరించారు.మధ్యాహ్నం పన్నెండు గంటలకు  పెనుక వంశానికి తళపతి(పెద్ద పూజారి) అయిన పెనుక పగడయ్య ఇంటిలో కంకణాలు కట్టి పానుపును(పసుపు, కుంకుమ) తయారు చేశారు.అక్కడే ప్రత్యేకంగా ఓ గదిలో  రహస్య పూజలు చేశారు. అనంతరం డోలు వాయిద్యాలు, డప్పు చప్పుళ్ల మధ్య శివసత్తులు, ఆడపడుచుల పూనకాలతో పానుపును గుడికి తరలించారు. అక్కడ కొంతసేపు రహస్య పూజలు చేశారు. అనంతరం అడవి మార్గాన మేడారం బైలెల్లారు.  ఎమ్మెల్యే సీతక్క, మేడారం జాతర నిర్వహణ కమిటీ సభ్యులు హాజరై పూజలు చేశారు.

అధికారులంతా అప్రమత్తంగా ఉండాలె: సీఎస్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు:  మేడారం జాతర డ్యూటీలో ఉన్న అధికారులు, సిబ్బంది అంతా అప్రమత్తంగా ఉండాలని, భక్తులకు ఎట్లాంటి ఇబ్బందులూ రాకుండా చర్యలు తీసుకోవాలని సీఎస్​ సోమేశ్ కుమార్ ఆదేశించారు. మంగళవారం బీఆర్‌‌కే భవన్ నుంచి వివిధ శాఖల ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నిరంతర కరెంటు, మంచినీటి సరఫరా, పారిశుధ్యం, టాయిలెట్ల ఏర్పాట్లు, బస్సులు, ఇతర రవాణా ఏర్పాట్లు, ట్రాఫిక్, పార్కింగ్ లాట్స్ తదితర అంశాలపై సమీక్షించారు. జాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికారులు సీఎస్​కు వివరించారు. జాతర జరిగినన్ని రోజుల పాటు వివిధ శాఖలకు సంబంధించి ఇంటర్ సెక్టోరల్ టీమ్స్ ప్రతిరోజు సమావేశమై ప్రణాళిక రూపొందించుకోవాలని సీఎస్​ ఆదేశించారు. ఎలాంటి అవాంతరం ఎదురైనా వెంటనే సమాచారం అందించేలా ఏర్పాట్లు చేసుకోవాలని, వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్, రోడ్డు భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. టోల్ గేట్ల వద్ద నోడల్ అధికారులను నియమించి ట్రాఫిక్​ ఇబ్బంది ఏర్పడకుండా అదనపు ఏర్పాట్లు చేయాలన్నారు. రహదారులపై మరమ్మతుల కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని, సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.