కొనసాగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు

కొనసాగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ముఖ్య నేతలంతా HICC సమావేశ ప్రాంగణానికి చేరుకున్నారు. ఇవాల్టి భేటీలో పలు కీలక అంశాలపై తీర్మానాలు చేయనున్నారు నేతలు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజకీయ తీర్మానం ప్రవేశ పెట్టనున్నారు. మరోవైపు తెలంగాణపై ఇవాల్టి సమావేశంలో కీలకంగా చర్చించనున్నారు. నేతలు ఎల్లప్పుడూ ప్రజల మధ్య ఉండాలని, వారి బాధలు తెలుసుకుని అండగా నిలవాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షులకు సూచించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఎంపీలు ఇదే నియమం పాటించాలన్నారు. తమ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోనే అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎంపీలు పర్యటించాలన్నారు. పక్క నియోజకవర్గాల్లో పార్టీ ఎంపీ లేకుంటే.. అక్కడా పర్యటించాలని సూచించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో గుజరాత్ ఎన్నికల ప్రిపరేషన్ పై మాట్లాడిన మోడీ నేతలకు పలు సూచనలు చేశారు. ఫిషరీస్, కోఆపరేటివ్ మంత్రిత్వ శాఖలపై ఎక్కువగా ఫోకస్ చేయాలని.. ఈ రెండు రంగాల్లో అభివృద్ధికి, ప్రజలకు తోడ్పాటు అందించేందుకు ఎక్కువ అవకాశాలున్నాయన్నారు మోడీ.

కుటుంబ పాలన, అవినీతి సర్కార్ ను ప్రజలు క్షమించరని అన్నారు జేపీ నడ్డా. రాష్ట్రంలో ఉద్యమ ఆకాంక్షలు నెరవేరటంలేదన్నారు. జనం బీజేపీ వైపు చూస్తున్నారని.. బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేసే విషయంపై ఫోకస్ పెట్టాలని సూచించారు. ఉత్తరాదినే కాకుండా దక్షిణాదిన కూడా బీజేపీని విస్తరిద్దామన్నారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రతిఒక్కరు పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఎప్పటికీ అధికారం తమదేననే భ్రమలో ఉంటున్నారని కేసీఆర్ పై విమర్ళు చేశారు నడ్డా. ప్రజల ఆకాంక్షలకు, ఆశలకు భిన్నంగా రాష్ట్రంలో పాలన సాగుతోందని విమర్శించారు. తెలంగాణ వంటి రాష్ట్రాల్లో బీజేపీ గెలవాల్సిన అవసరం ఉందన్నారు నడ్డా.   సాయంత్రం వరకు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు కొనసాగనున్నాయి.