బస్సు డిపో రాలే.. రాత్రి రైలు దిగితే స్టేషన్​లోనే నిద్ర

బస్సు డిపో రాలే.. రాత్రి రైలు దిగితే స్టేషన్​లోనే నిద్ర
  •   పట్టించుకోని ప్రజాప్రతినిధులు

పెద్దపల్లి,వెలుగు: పెద్దపల్లి వాసులు 20 ఏళ్లుగా బస్సు డిపో కోసం ఎదురు చూస్తున్నారు. తెలంగాణ ఆవిర్భావానికి ముందు పెద్దపల్లి నియోజకవర్గం ఎప్పుడూ అపోజిషన్​ఎమ్మెల్యేనే గెలిచేది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత అధికార పార్టీ నుంచి దాసరి మనోహర్​రెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 2016లో పెద్దపల్లి జిల్లాగా ఏర్పాటైన తర్వాత జిల్లా కేంద్రంలో బస్సు డిపో ఏర్పాటు చేస్తారని జిల్లా ప్రజలు ఆశించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. 

చిత్తశుద్ది  కరువు ...

పెద్దపల్లిలో బస్సు డిపో ఏర్పాటుపై ప్రజాప్రతినిధులు దృష్టిపెట్టడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. స్థానికంగా రైల్వే స్టేషన్​ఉంది. నిత్యం వందలాది మంది అటూఇటూ వెళ్తుంటారు. దూర ప్రాంతాలకు చెందిన చాలామంది పట్టణానికి వస్తుంటారు. సమీపంలోని గ్రామాలకు వెళ్లాలంటే బస్సులు ఉండవు. గోదావరిఖని, కరీంనగర్, మంచిర్యాల నుంచి బస్సులు వస్తేనే గ్రామాలకు వెళ్లేది.

రాత్రిపూట రైల్వే స్టేషన్​లో  దిగిన ప్రయాణికులు ఎటూ వెళ్లలేక స్టేషన్, బస్టాండ్​లోనే కునుకు తీస్తున్నారు. ఇక్కడి ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా పెద్దపల్లిలో గతంలోనే బస్​డిపో ఏర్పాటు చేస్తామని లీడర్లు హామీ ఇచ్చారు. కానీ.. మంథని నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన మంత్రి చొరవతోనే డిపో అక్కడికి తరలిపోయిందనే వాదన ఉంది.

డిపో ఏర్పాటు చేయాలి..

పెద్దపల్లిలో బస్సు డిపో ఏర్పాటు చేయాలి. రాత్రి పూట దిగితే బస్టాండ్​లోనే నిద్రపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్థానికంగా డిపో ఉంటే చుట్టుపక్కల ఏ గ్రామమైనా ఈజీగా వెళ్లొచ్చు. – పగాని సారయ్యగౌడ్​, మాజీ ఎంపీపీ,కాల్వ శ్రీరాంపూర్​