బస్సు కోసం వేచి చూస్తున్న వాళ్లను ఢీకొట్టిన కారు

బస్సు కోసం వేచి చూస్తున్న వాళ్లను ఢీకొట్టిన కారు
  •      రాజస్థాన్​లో ఒకే కుటుంబంలో నలుగురు మృతి
  •     మృతుల్లో 8 నెలల ప్రెగ్నెంట్, రెండేండ్ల చిన్నారి

జైపూర్, లక్నో: బస్సు కోసం వేచి చూస్తుండగా కారు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో గర్భిణి సహా రెండేండ్ల బాలుడు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారిని ఢీకొట్టిన తర్వాత కారు డ్రైవర్ పరారయ్యాడని చెప్పారు. రాజస్థాన్​లోని డెగానాలో ఆదివారం ఉదయం ఈ ఘోరం జరిగింది. కూలీ పనిచేసుకునే చోటూరామ్ తన రెండేండ్ల కొడుకు, భార్య, బంధువుతో కలిసి ఆదివారం ఉదయం ఓ పెండ్లి వేడుకకు బయల్దేరాడు.

 బస్సుకోసం వేచి ఉండగా స్పీడ్​గా వచ్చిన స్కార్పియో కారు వీరిని ఢీకొట్టింది. దీంతో చోటూరామ్, అతడి భార్య సుమన్, కొడుకు హృతిక్, మరో మహిళ అక్కడికక్కడే చనిపోయారు. సుమన్ అప్పటికే 8 నెలల ప్రెగ్నెంట్ అని పోస్ట్ మార్టం నిర్వహించిన డాక్టర్లు వెల్లడించారు. కేసు ఫైల్ చేశామని, పరారైన కారు డ్రైవర్ కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

యూపీలో  ఏడుగురి మృతి..

ఉత్తరప్రదేశ్​లోని జాన్​పూర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఓ కారు అదుపు తప్పి హైవేపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ తొమ్మిది మంది ఒకే కటుంబానికి చెందినవారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. బాధితులు బిహార్ లోని సీతామర్హి నుంచి ప్రయాగ్ రాజ్​కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు.