పట్టించుకోకుండా వెళ్లిపోయారు: వ్యక్తిని ఢీకొట్టిన డీసీసీబీ చైర్మన్ కారు

పట్టించుకోకుండా వెళ్లిపోయారు: వ్యక్తిని ఢీకొట్టిన డీసీసీబీ చైర్మన్ కారు

వర్ధన్నపేట, వెలుగు: వృద్ధుడిని ఢీకొట్టిన డీసీసీబీ చైర్మన్​ కారు ఆగకుండా వెళ్లిపోవడంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన ఆదివారం వరంగల్​ రూరల్​ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల మృతిచెందిన ఓ వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించడానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్​, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు వర్ధన్నపేట పట్టణానికి వచ్చారు. ఈ క్రమంలోనే కాన్వాయ్ లో ఉన్న డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు కారు రోడ్డు దాటుతున్న సారయ్య అనే వృద్ధుడిని ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన సారయ్య రోడ్డుపైనే పడిపోయాడు. అతడిని కనీసం ఆస్పత్రికి కూడా తరలించకుండా నేతలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అరగంటైనా  ఎవరూ రాకపోవడం, బాధితుడిని ఆస్పత్రికి తీసుకెళ్లకపోవడంతో సారయ్య బంధువులు, స్థానికులు ఆగ్రహించారు. ఘటన స్థలంలో ఆందోళనకు దిగారు. దీంతో లోకల్ లీడర్లు చొరవ తీసుకొని సారయ్యను అంబులెన్స్ లో వరంగల్ ఆస్పత్రికి తరలించారు.