నాగపూర్​లో నలుగురి హత్య కేసు రీ ఓపెన్

నాగపూర్​లో నలుగురి హత్య కేసు రీ ఓపెన్
  •  నిందితుడిని వనపర్తి జిల్లాకు తీసుకువచ్చి  సీన్  రీ కన్​స్ట్రక్షన్ ​చేసిన పోలీసులు 

వనపర్తి, వెలుగు: వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్​లో రెండేండ్ల కింద ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పదంగా చనిపోయిన కేసును పోలీసులు రీ ఓపెన్ ​చేశారు. అప్పుడు సంఘటనా స్థలంలో నాలుగు డెడ్​బాడీలు కనిపించడం, నిమ్మకాయలు, పసుపు కుంకుమ, తవ్విన ఆనవాళ్లు కనిపించడంతో గుప్త నిధుల కోసం ప్రయత్నించిన కుటుంబం ..ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు భావించారు. అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసిన పోలీసులు తర్వాత చేతులు దులుపుకున్నారు. తర్వాత ఎలాంటి ఆధారాలు లేవని కేసును కోర్టు కొట్టివేసింది. 

దొంగబాబానే కారణమంటూ...

నలుగురు కుటుంబసభ్యుల చావుకు కారణం నాగర్​కర్నూల్​కు చెందిన దొంగ బాబా సత్యనారాయణ యాదవ్ కారణమని గత ఏడాది వెలుగు చూసింది. వీరినే కాకుండా మరో పది మందిని కూడా హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో బయట పడింది. దీం తో నాగపూర్ కేసు రీ ఓపెన్ చేశారు. ఇందులో భాగంగా వనపర్తి డీఎస్పీ ఆనంద్ రెడ్డి ఆధ్వర్యంలో సత్యనారాయణ యాదవ్ ను శుక్ర, శని, ఆదివారాల్లో నాగపూర్​ తీసుకువచ్చి సీన్ రీ కన్స్ట్రక్షన్ చేశారు. ఈ సందర్భంగా ఎవరెవరినీ ఎలా చంపింది సత్యనారాయణ చూపించినట్టు సమాచారం.

సాధారణ తాపీ మేస్త్రీ అయిన సత్యనారాయణ ఈజీ మనీ కోసం మంత్ర, తంత్రాలు నమ్మే అమాయకులను మోసం చేయడమే పనిగా పెట్టుకున్నాడు. తనకు తాంత్రిక విద్యలు తెలుసునని, గుప్తనిధులు ఎక్కడున్నాయో చెబుతానని బుకాయించేవాడు. అది నమ్మిన వాళ్ల దగ్గర భూములు, ప్లాట్లు, బంగారం, డబ్బులు తీసుకునేవాడు. తర్వాత ఎవరైనా తిరిగి ఇమ్మని అడిగితే పూజ పేరుతో పిలిచి తీర్థంలో సైనేడ్​ కలిపి హతమార్చేవాడు.