క్యాసినో మాయ.. అప్పుల తిప్పలు.. యాదాద్రి టూ గోవా..

క్యాసినో మాయ.. అప్పుల తిప్పలు.. యాదాద్రి టూ గోవా..
  • రెగ్యులర్‌‌గా టూర్‌‌లు..  ఒక్కరిని తీసుకెళ్తే ఏజెంట్ కు రూ. 10 వేలు కమీషన్​

యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లా నుంచి గోవా వెళ్లి క్యాసినో ఆడుతూ కొంత మంది రూ. లక్షల్లో  పోగొట్టుకుంటున్నారు. ఆన్ లైన్ జూదానికి అలవాటు పడ్డ వారిని ఏజెంట్లు గోవా తీసుకెళ్లి మరీ క్యాసినో ఆడిస్తున్నారు.  గోవాలో క్యాసినో నిర్వహించే రెస్టారెంట్లకు వీరు తొలుత రూ. లక్ష చొప్పున డిపాజిట్​ చేస్తారు. ఆ తర్వాత వివిధ ప్రాంతాల నుంచి కొందరిని తొలుత ఫ్రీగా గోవాకు తీసుకెళ్తున్నారు. 

ఆడే వారితో ఉన్న వారికి మందు, విందు ఫ్రీగా ఇస్తారు.క్యాసినో ఆట ఆడే చోట టోకెన్లు వాడాల్సి ఉంటుంది. ఇక్కడ సంపాదించిన సొమ్ము, లేదా అప్పుల ద్వారా సమీకరించిన సొమ్ముతో పలువురు గోవాకు వెళ్తున్నారు. 

ఆడడానికి వెళ్లే వారు తాము తీసుకెళ్లిన డబ్బును నగదు రూపంలో లేదా ఫోన్​పే, గూగుల్​పే, ఆన్​లైన్​ పేమెంట్​రూపంలో రెస్టారెంట్​ కౌంటర్లో చెల్లించి అందుకు సమాన విలువైన టోకెన్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కో టోకెన్​ రూ. వెయ్యి నుంచి ఆపై ఉంటుంది. ఆట ఆడే సమయంలో లిక్కర్​తో పాటు ఫుడ్​కూడా అందిస్తారు.

ఆస్తుల అమ్మకం.. ఎక్కువ వడ్డీకి అప్పులు

డబ్బులు పోతుంటే.. సంపాదించాలన్న కసితో తన ఒంటిపై ఉన్న బంగారం, భూములు కూడా అమ్ముకుంటున్నారు. క్యాసినో ఆడడానికి రూ. 10 అంతకంటే ఎక్కువ వడ్డీకి అప్పులు చేస్తున్నారు. 

ఒక్కరిని తీసుకెళ్తే రూ. 10 వేలు కమీషన్

క్యాసినో ఆడడానికి వెళ్తున్నవారు ఆస్తులు పోగొట్టుకుంటుంటే.. వారిని తీసుకెళ్తున్న ఏజెంట్లు మాత్రం ఆస్తులు కూడబెట్టుకుంటున్నారు. క్యాసినో ఆడే వారిని ఏజెంట్లు గ్రూపుల వారీగా గోవాకు తరలిస్తున్నారు.  ఇలా ఒక్కరిని గోవా తీసుకెళ్లిన ఏజెంట్​కు రూ. 10 వేలు కమీషన్​ రూపంలో అందుతుందని తెలుస్తోంది. 

ఇలా ప్రతి వారం కొందరినీ తీసుకెళ్లే ఏజెంట్లు ఉన్నారు. ఇలాంటి వారిలో పలువురు నెలకు రూ. 2 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకూ కమీషన్​ రూపంలో పొందుతున్నట్టు తెలుస్తోంది. ఇలా కమీషన్​ రూపంలో సంపాదించిన సొమ్ముతో కొందరు ఏజెంట్లు ఇతర ప్రాంతాల్లో రూ. కోట్ల విలువైన ఆస్తులు కూడా బెట్టుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది.