జైన్‌ కస్టడీ పొడిగింపునకు సీబీఐ కోర్టు నిరాకరణ

జైన్‌ కస్టడీ పొడిగింపునకు సీబీఐ కోర్టు నిరాకరణ

న్యూఢిల్లీ : మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ జ్యుడీషియల్‌ కస్టడీని పొడిగించేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు నిరాకరించింది. ఆయన ఆసుపత్రిలో ఉన్నందున వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరచాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)ని కోర్టు కోరింది. ఆక్సిజన్ స్థాయిలు తగ్గడంతో జైన్ సోమవారం ఇక్కడి ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రిలో చేరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ)లోని క్రిమినల్ సెక్షన్ల కింద మే 30వ తేదీన ఈడీ జైన్ ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 

సత్యేంద్ర జైన్ ను తీహార్‌ జైలు నుంచి జీబీపంత్‌ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆ తర్వాత ఎల్‌ఎన్‌జేపీకి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్య వర్గాలు వెల్లడించాయి. ఆక్సిజన్ స్థాయి తగ్గిపోయిందని, ఎలక్ట్రో కార్డియోగ్రఫీ (ECG)లో కొన్ని మార్పులు కనిపించాయని, ఆ తర్వాత అతన్ని హార్ట్ చెకప్ కోసం ఆసుపత్రికి పంపామని సీనియర్ జైలు అధికారి తెలిపారు. కేజ్రీవాల్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్న జైన్‌.. హవాలా లావాదేవీల ఆరోపణలపై పీఎంఎల్‌ఏ కింద ఈడీ విచారణ జరుపుతోంది.