పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను భారీగా తగ్గించిన కేంద్రం

పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను భారీగా తగ్గించిన కేంద్రం

వడ్డీ రేట్లపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. చిన్న మొత్తాల పొదుపు, పీపీఎఫ్, సుకన్య సమృద్ది యోజన పథకం ఖాతాలపై వడ్డీ రేట్లను భారీగా తగ్గించింది. దీంతో మధ్య తరగతి వర్గాలపై ఎఫెక్ట్ పడనుంది. బ్యాంకులు, చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో దాచుకునే సొమ్ము సహా.. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌పై కేంద్ర ప్రభుత్వం భారీగా వడ్డీ రేట్లను తగ్గించింది. ఇది మిడిల్ క్లాస్ వర్గాలపై తీవ్ర ప్రభావం చూపించనుంది. పొదుపు ఖాతాల్లో డిపాజిట్లపై 4  శాతంగా ఉన్న వడ్డీ రేటును 3.5 శాతానికి తగ్గించింది. 

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వడ్డీపైనా కేంద్రం కోత పెట్టింది. దీన్ని 7.1 శాతం నుంచి 6.4 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్‌పై వడ్డీ గతంలో 6.8 శాతంగా ఉండగా.. ఇప్పుడు 5.9 శాతానికి తగ్గింది. పబ్లిక్ ప్రావిడెంట్‌‌ఫై వడ్డీ ఇంత తక్కువగా ఉండటం 1974 తర్వాత ఇదే మొదటిసారి.1974 ఆగష్టు, మార్చి 1975 మధ్య పీపీఎఫ్ పై వడ్డీ రేటు 7 శాతంగా ఉంది. అంతకు ముందు ఇది 5.8 శాతంగా ఉండేది. 

చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీని ప్రతి 3 నెలలకోసారి ప్రకటిస్తారు. ఇవి బ్యాంకుల స్థిర డిపాజిట్ రేట్లకు అనుగుణంగా ఉంటాయి. మొదటిసారి సేవింగ్స్ డిపాజిట్లపై 0.5 శాతం వడ్డీని తగ్గించారు. సుకన్య సమృద్ధి యోజన పథకం ఖాతాలపై ఇచ్చే వడ్డీని 7.6 శాతం నుంచి 6.9 శాతానికి తగ్గించారు. కిసాన్ వికాస్ పత్రాలపై చెల్లించే వడ్డీని 6.9 శాతం నుంచి 6.2 శాతానికి తగ్గించారు. సవరించిన వడ్డీ రేట్లు ఇవాల్టి నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.