కొత్తగా కోవిడ్ గైడ్ లైన్స్ విడుదల చేసిన కేంద్రం

కొత్తగా కోవిడ్ గైడ్ లైన్స్ విడుదల చేసిన కేంద్రం
  • కొత్త గైడ్ లైన్స్ విడుదల చేసిన కేంద్రం
  • ఇండ్లు, ఆఫీసుల్లో వెంటిలేషన్ బాగుండాలె 
  • లేకుంటే వైరస్ సోకే చాన్స్ ఎక్కువ
  • ఆక్సిజన్​ అవసరం ఉన్నోళ్లకే రెమ్డిసివిర్​ ఇవ్వాలి

కేంద్రం తాజాగా కరోనా గైడ్ లైన్స్ లో పలు మార్పులు చేసింది. ‘‘కొవిడ్ క్లినికల్ మేనేజ్ మెంట్ ప్రొటోకాల్” పేరిట రివైజ్డ్ గైడ్ లైన్స్ ను విడుదల చేసింది. కరోనా పేషెంట్లకు ప్లాస్మా థెరపీ వద్దని చెప్పింది. రెమ్డిసివిర్, ఐవర్ మెక్టిన్ మందుల వాడకంపై జాగ్రత్తలు పాటించాలని సూచించింది.  

ప్లాస్మా థెరపీ అసలే వద్దు 
కరోనా పేషెంట్లకు ప్లాస్మా థెరపీ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని, దీనితో వైరస్ మ్యుటేషన్లు పెరుగుతున్నాయంటూ ఎయిమ్స్, ఐసీఎంఆర్, నేషనల్ కొవిడ్ టాస్క్ ఫోర్స్ నిపుణులు చేసిన సూచనల మేరకు కేంద్రం ఇటీవల ప్లాస్మా థెరపీ వద్దని ప్రకటించింది. ఇదే విషయాన్ని తాజా గైడ్ లైన్స్ లో కూడా తెలియజేసింది. కరోనా పేషెంట్లకు ప్లాస్మా థెరపీ ద్వారా ట్రీట్ మెంట్ చేయొచ్చని నిరుటి గైడ్ లైన్స్ లో సూచించన కేంద్రం.. తాజా గైడ్ లైన్స్ లో ప్లాస్మా థెరపీ వద్దని స్పష్టం చేసింది.

మైల్డ్ కేసులకే ఐవర్ మెక్టిన్  
సింప్టమ్స్ తక్కువగా ఉన్న కరోనా పేషెంట్లకే ఐవర్ మెక్టిన్ ట్యాబ్లెట్లను వాడాలని కేంద్రం స్పష్టం చేసింది. పేషెంట్ శరీర బరువులో కిలోకు 200 మైక్రోగ్రాముల చొప్పున రోజుకు ఒకసారి.. మూడు నుంచి ఐదు రోజుల పాటు మాత్రమే ఐవర్ మెక్టిన్ ను వాడాలని తెలిపింది. గర్భిణులు, పాలిచ్చే తల్లులకు ఈ మందును వాడొద్దని హెచ్చరించింది.  

సీరియస్ కేసులకే స్టెరాయిడ్స్ 
కరోనా సింప్టమ్స్ తక్కువగా ఉన్న పేషెంట్లకు స్టెరాయిడ్స్​ వాడొద్దని తాజా గైడ్ లైన్స్​లో కేంద్రం తెలిపింది. ఏడు రోజులు దాటినా సింప్టమ్స్ కొనసాగితే.. అవి కంటిన్యూగా పెరుగుతూ కండిషన్ సీరియస్ గా మారితేనే..  డాక్టర్లు తక్కువ డోస్ తో ఓరల్ స్టిరాయిడ్స్​ను ఇవ్వాలని సూచించింది.

ఆక్సిజన్ అవసరమైనోళ్లకే రెమ్డిసివిర్

కరోనా పేషెంట్ పరిస్థితి మధ్యస్తంగా లేదా సీరియస్ గా ఉండి, ఆక్సిజన్ సపోర్ట్ అవసరం అయితేనే రెమ్డిసివిర్ వాడాలని కేంద్రం స్పష్టం చేసింది. పాజిటివ్ వచ్చిన 10 రోజుల్లోపు మాత్రమే రెమ్డిసివిర్ వాడాలని చెప్పింది. కిడ్నీ, లివర్ సమస్యలు ఉన్నవాళ్లకు, గర్భిణులకు, పాలిచ్చే తల్లులకు, 12 ఏళ్లలోపు పిల్లలకు వాడరాదని స్పష్టం చేసింది. రెమ్డిసివిర్, ఐవర్‌‌మెక్టిన్‌‌లను అతిగా వాడొద్దని కేంద్రం హెచ్చరించింది. రెమ్డిసివిర్‌‌ను ఎబోలా వైరస్ ట్రీట్‌‌మెంట్ కోసం, ఐవర్‌‌మెక్టిన్‌‌ను పారాసైటిక్ ఇన్ఫెక్షన్లను తగ్గించేందుకు తయారు చేశారని గుర్తు చేసింది. ఏ మందును వాడినా.. సేఫ్టీ, ఎఫికసీ ముఖ్యమని సూచించింది.