- సభలో అందరికీ మాట్లాడేచాన్స్ ఇవ్వాలి
న్యూఢిల్లీ, వెలుగు: పార్లమెంట్లో ప్రజల గొంతు విని పించాల్సిన బాధ్యత ప్రతి ఎంపీపై ఉందని పెద్దపల్లి లోక్‌సభ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ అన్నారు. లోక్ సభ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఈ ప్రయత్నమే చేస్తున్నారని చెప్పారు. అయితే, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ గొంతును అణచివేయాలని చూస్తున్నదని ఫైర్ అయ్యారు. పార్లమెంట్ ఆవరణలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘‘సర్ పై లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తన ఆలోచనలు పంచుకోవాలని భావిస్తున్నారు.
కానీ.. స్పీకర్ ఓం బిర్లా కనీసం ప్రతిపక్ష నేతల ఆలోచనలను కూడా స్వీకరించేందుకు అనుమతించడం లేదు. మాట్లాడేందుకు అస్సలు అవకాశం ఇవ్వడం లేదు. వర్షాకాల సమావేశాల్లోనూ ఇదే జరిగింది. ప్రజాస్వామ్యంలో అధికార, ప్రతిపక్షాలకు మాట్లాడే స్వేచ్ఛ ఉంటది. కానీ.. దేశంలోని 60 కోట్ల మంది మద్దతుతో పార్లమెంట్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రతిపక్ష నేతలకు కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం దురదృష్టకరం. ఈ పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని బాధ్యతాయుతంగా నడపాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగ పరిరక్షణపై తాము పోరాడుతూనే ఉంటాం’’అని వంశీ కృష్ణ స్పష్టం చేశారు. రాజ్యాంగ హక్కులు కాపాడేందుకే పార్లమెంట్ ఆవరణలో నిరసన కార్యక్రమాలు చేపడ్తున్నట్లు తెలిపారు.
‘‘రాహుల్ గాంధీ మాదిరిగానే.. నేను కూడా పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గ ప్రజల సమస్యలు, వారి ఆకాంక్షలు, అవసరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తున్న. రామగుండంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు అంశాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దృష్టికి తీసుకెళ్లిన. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. ఏఏఐ స్టడీ టీమ్‌ను కూడా రామగుండంకు పంపుతానని చెప్పారు’’అని వంశీకృష్ణ వివరించారు.
