- ఈ కోడ్‌లను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలి
- సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ.రాఘవులు
మెదక్, వెలుగు : కార్మిక హక్కులను హరించేందుకే కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్‌లను తీసుకొచ్చిందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు విమర్శించారు. సీఐటీయూ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఆదివారం మెదక్‌లో అగ్రికల్చర్ మార్కెట్ నుంచి చిల్డ్రన్స్ పార్క్ వరకు ర్యాలీ నిర్వహించారు.
అనంతరం జరిగిన బహిరంగ సభలో రాఘవులు మాట్లాడారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి పెట్టుబడిదారులు రూ.20 వేల కోట్లు ఖర్చు పెట్టారని, ఇప్పుడు వారి మేలు కోసమే ఆయన పనిచేస్తున్నారని ఆరోపించారు. కొత్త లేబర్ కోడ్‌ల వల్ల కార్మికులకు మేలు కలుగుతుందని, కొత్త సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని చెబుతున్న కేంద్రం మాటలు పూర్తిగా అవాస్తవం అని, ఈ కోడ్‌ల వల్ల కార్మికులకు కొత్త ప్రయోజనాలు కలుగకపోగా.. ఉన్న హక్కులు హరించుకుపోతాయన్నారు.
గడిచిన 20 ఏండ్లలో పెట్టుబడిదారుల ఆస్తులు 600 శాతం పెరిగాయన్నారు. సంపద మొత్తం సంపన్నుల చెంతకే చేరుతోందన్నారు. దేశంలోని 350 మంది సంపద రూ.50 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. అంబానీకి గతంలో రూ. లక్ష కోట్లు ఉంటే.. ఇప్పుడు రూ.12 లక్షల కోట్లు అయ్యాయని, అదానీకి గతంలో రూ.60 వేల కోట్లు ఉంటే ఇప్పుడు రూ.10 లక్షల కోట్లకు పెరిగాయన్నారు. ఎన్నేండ్లు గడిచినా ప్రజల ఆదాయం, కార్మికుల జీతాలు మాత్రం పెరగడం లేదన్నారు.
లేబర్ కోడ్‌లను పూర్తిగా రద్దు చేసే వరకు కార్మికులు, రైతు కూలీలు, రైతులు ఏకమై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ‘పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ కార్మికుల బాగోగులు పట్టించుకోలేదు.. లేబర్ కోడ్‌లను వ్యతిరేకించలేదు.. కానీ ఇప్పుడు కోడ్‌లను రద్దు చేయాలని కేటీఆర్ మాట్లాడుతున్నారు.. ఆ పార్టీ మోసాన్ని ప్రజలు అర్థం చేసుకుని తగిన బుద్ధి చెబుతారని అన్నారు.
లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ అఖిల భారత అధ్యక్షురాలు హేమలత, నాయకులు సాయిబాబు, చుక్క రాములు, ఎ.మల్లేశం, బాలమణి, కె.మల్లేశం, బస్వరాజ్
పాల్గొన్నారు.
