కేంద్ర కేబినెట్​లోకి రాష్ట్రం నుంచి మరొకరు! 

కేంద్ర కేబినెట్​లోకి రాష్ట్రం నుంచి మరొకరు! 

కేంద్ర కేబినెట్​లోకి రాష్ట్రం నుంచి మరొకరు! 
సంక్రాంతి తర్వాత విస్తరణ
ప్రచారంలో సంజయ్​, సోయం బాపురావు పేర్లు
అర్వింద్​, లక్ష్మణ్​కూ చాన్స్​ ఉండొచ్చంటున్న ఢిల్లీ వర్గాలు

న్యూఢిల్లీ, వెలుగు : సంక్రాంతి తర్వాత కేంద్ర కేబినెట్ ​విస్తరణ జరుగనుంది. 2024 లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేబినెట్​లో ప్రధాని మోడీ  భారీ మార్పులు చేపడతారన్న ఊహాగానాలు ఢిల్లీలో జోరుగా సాగుతున్నాయి. తెలంగాణ నుంచి మరొకరికి కేబినెట్​లో చోటు దక్కొచ్చన్న ప్రచారం జరుగుతున్నది. ప్రస్తుతం సికింద్రాబాద్​ ఎంపీ కిషన్​రెడ్డి కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రిగా కొనసాగుతున్నారు. తెలంగాణ నుంచి బీజేపీ తరఫున లోక్ సభకు నలుగురు ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తుండగా..  ఇందులో కిషన్ రెడ్డి మినహా మిగిలిన ముగ్గురిలో బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, సోయం బాపురావు ఉన్నారు. రాష్ట్రానికి చెందిన లక్ష్మణ్​.. యూపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేబినెట్​ విస్తరణలో సంజయ్, బాపురావు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సంజయ్ పదవీకాలం వచ్చే నెలతో ముగియనుంది. 

గిరిజన బిడ్డ అయిన సోయం బాపూరావుకు గత మంత్రివర్గ విస్తరణలో ఫోన్ కాల్ వచ్చి.. కొద్దిలో పదవి దక్కలేదన్న వార్తలు ఉన్నాయి. ఈసారి ఎస్టీ కోటాలో ఆయనకు అవకాశం దక్కవచ్చన్న ప్రచారం జరుగుతున్నది. ఉత్తర తెలంగాణలో కీలకంగా వ్యవహరిస్తున్న ఎంపీ ధర్మపురి అర్వింద్​కు కూడా కేబినెట్​లో చోటు దక్కవచ్చన్న చర్చ ఢిల్లీ వర్గాల్లో కొనసాగుతున్నది. బీజేపీ సీనియర్​ నేత లక్ష్మణ్​ ఇప్పటికే పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. తెలంగాణ నుంచి మరొకరిని మంత్రి వర్గంలోకి తీసుకోవాలనే ఉద్దేశంతోనే లక్ష్మణ్ కు రాజ్యసభ సీటు ఇచ్చినట్లు ప్రచారంలో ఉంది.