తాయిలాల రేట్లు లెక్క గట్టి.. అభ్యర్థుల ఖాతాల్లో వేయండి: సీఈసీ

తాయిలాల రేట్లు లెక్క గట్టి.. అభ్యర్థుల ఖాతాల్లో వేయండి: సీఈసీ
  •     రాష్ట్ర అధికారులకు కేంద్రం ఎన్నికల సంఘం టీమ్​ ఆదేశం
  •     సీఈఓ, సీఎస్​, డీజీపీ, ఉన్నతాధికారులు, ఎన్​ఫోర్స్​మెంట్​ ఏజెన్సీలతో భేటీ
  •     ఎన్నికల ఏర్పాట్లు, అధికారుల పనితీరుపై సమీక్ష

హైదరాబాద్, వెలుగు: పట్టుబడుతున్న ఎన్నికల తాయిలాలు, బహుమతుల ధరను లెక్కగట్టి, నామినేషన్ల ఖరారు తర్వాత ఆయా అభ్యర్థుల ఎన్నికల ఖర్చులో కలపాలని రాష్ట్ర ఎన్నికల ముఖ్యాధికారి(సీఈవో)ని కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) బృందం ఆదేశించింది. పట్టుబడుతున్న నగదు విషయంలో తగిన సాక్ష్యాధారాలుంటే ఎవరివి వాళ్లకు తిరిగి ఇచ్చేయాలని చెప్పింది. మద్యం, మాదక ద్రవ్యాల తరలింపును అడ్డుకోవడానికి టెక్నాలజీని ఉపయోగించుకోవాలని ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్ ఏజెన్సీలకు, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు సూచించింది. అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లకు రంగం సిద్ధమవుతున్నందున ఇక్కడి అధికారుల పనితీరును మరోసారి సమీక్షించేందుకు సీఈసీకి చెందిన సీనియర్ అధికారుల బృందం బుధవారం హైదరాబాద్​కు వచ్చింది. సీఈవో  ఆఫీసులో ఉన్నతాధికారులతో సమావేశమై పలు అంశాలపై దిశానిర్దేశం చేసింది. 

ఈ టీమ్​లో కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్  ధర్మేంద్ర శర్మ, మరో సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్  నితేశ్​కుమార్ వ్యాస్, ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ ఉన్నారు. వారికి సీఈవో వికాస్​ రాజ్,  అడిషనల్​ సీఈవో లోకేశ్​కుమార్, జాయింట్ సీఈవో సర్ఫరాజ్ అహ్మద్, డిప్యూటీ సీఈవో సత్యవాణి  ప్రజెంటేషన్ల ద్వారా ఇప్పటివరకు చేసిన ఏర్పాట్లను వివరించారు. ఎఫ్‌‌ఎస్‌‌టీ, ఎస్‌‌ఎస్‌‌టీ, 1950, సువిధ, సి-విజిల్, ఎంసీఎంసీ పర్యవేక్షణ కోసం ఇంటిగ్రేటెడ్ కంట్రోల్‌‌ రూమ్‌‌ను ఏర్పాటు చేయడంపై టీమ్​ సంతృప్తి వ్యక్తం చేసింది. ఓటర్ల జాబితా తుది సవరణల తర్వాత పెండింగ్‌‌లో ఉన్న దరఖాస్తులు, ఓటరు కార్డుల పంపిణీ, ఓటర్ల సమాచార స్లిప్‌‌ల వివరాలు, ఎంసీఎంసీ సర్టిఫికెట్లను రోజువారీగా జారీ చేయాలని ఆదేశించింది. కీలక పోలింగ్ కేంద్రాల్లో నిఘా కెమెరాల ఏర్పాటు పరిస్థితిని ధర్మేంద్ర శర్మ అడిగి తెలుసుకున్నారు. అనంతరం జరిగిన ఇతర సమీక్షా సమావేశాలకు డీజీపీ అంజనీ కుమార్,  స్పెషల్​ సీఎస్​ సునీల్ శర్మ , రవాణా  శాఖ ప్రిన్సిపల్​ సెక్రటరీ వాణీ ప్రసాద్, ఎన్నికల వ్యయ పరిశీలన నోడల్ అధికారి మహేశ్​ భగవత్  హాజరయ్యారు. సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీ కుమార్ తో కేంద్ర ఎన్నికల సంఘం టీమ్​ వేరువేరుగా సమావేశమైంది. 

కంప్లయింట్స్​ను  ఎప్పటికప్పుడు పరిష్కరించాలి

వర్క్ స్పీడ్ మరింత పెంచాలని ఎన్​ఫోర్స్​మెంట్​ ఏజెన్సీలను కేంద్రం ఎన్నికల సంఘం టీమ్​ సూచించింది. దసరాకు మూడు రోజుల ముందు నుంచి నగదు, బంగారం, వెండి, ఇతర వస్తువుల స్వాధీనం తగ్గడంపై ఆరా తీసినట్లు సమాచారం. నామినేషన్స్ కు ఏర్పాట్లతో పాటు అఫిడవిట్ అంశంలో సీరియస్ గా ఉండాలని, వచ్చే ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు త్వరితగతిన వివరణ ఇవ్వాలని సీఈవోను సీఈసీ టీమ్​ ఆదేశించింది. లా అండ్ ఆర్డర్ విషయంలో కఠినంగా వ్యవహరించాలని డీజీపీకి స్పష్టం చేసింది. పదిరోజులుగా రాష్ట్రంలో జరిగిన పలు అంశాలపై ఆరా తీసినట్లు తెలిసింది. పలువురు అధికారులపై వస్తున్న ఫిర్యాదుల గురించి సీఎస్ తో చర్చించింది. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని రాష్ట్ర అధికారులకు సీఈసీ టీమ్​ హెచ్చరించింది.