దిగొచ్చిన కేంద్రం ఐదేండ్ల ప్లాన్ తో కనీస మద్దతు ధర

దిగొచ్చిన కేంద్రం ఐదేండ్ల ప్లాన్ తో  కనీస మద్దతు ధర

    సహకార సొసైటీల ద్వారా పంటల కొనుగోలు నిర్ణయం

    ఇందుకోసం త్వరలోనే పోర్టల్  ప్రారంభించనున్నట్లు వెల్లడి
    కేంద్రం ప్రతిపాదనపై నిపుణులతో చర్చించి చెప్తమన్న రైతులు

చండీగఢ్, న్యూఢిల్లీ: 
పప్పు ధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటలను కనీస మద్దతు ధర(ఎంఎస్​పీ) కు కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఐదేండ్ల ప్లాన్​ను ప్రతిపాదించింది. రైతులతో ఒప్పందం కుదిరిన తర్వాతి నుంచి ఈ ప్లాన్ అమలులోకి వస్తుందని కేంద్ర మంత్రులు చెప్పారు. ఈమేరకు ఆదివారం రాత్రి జరిగిన నాలుగో విడత చర్చల్లో రైతు సంఘాల నేతల ముందు ఈ ప్రతిపాదన ఉంచారు. రాత్రి పొద్దుపోయేంత వరకూ (దాదాపు రాత్రి 1 గంట) వరకు ఈ ప్రతిపాదనపై చర్చ జరిగినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం తరఫున వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్​ గోయల్, వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి అర్జున్  ముండా, హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్  రాయ్ ఈ చర్చల్లో పాల్గొన్నారు. కనీస మద్దతు ధరకు గ్యారంటీ ఇవ్వడంతో పాటు పలు డిమాండ్లపై చర్చించారు. 

రైతుల తరపున పంజాబ్  సీఎం భగవంత్  సింగ్  మాన్  పాల్గొన్నారు. సమావేశం తర్వాత మీడియాతో పీయూష్​ గోయల్  మాట్లాడారు. ‘‘కందిపప్పు, మినపప్పు, ఎర్రపప్పు, మొక్కజొన్న, పత్తి పండించే రైతులతో నేషనల్  కోఆపరేటివ్  కన్జ్యూమర్స్  ఫెడరేషన్(ఎన్ సీసీఎఫ్), నేషనల్ అగ్రికల్చరల్  కోపరేటివ్  మార్కెటింగ్  ఫెడరేషన్  ఆఫ్​ ఇండియా (నాఫెడ్) వంటి సహకార సొసైటీలు ఒక ఒప్పందం కుదుర్చుకుంటాయి. వచ్చే ఐదేండ్ల పాటు ఎంఎస్ పీ తో రైతుల పంటలను ఆ సొసైటీలు కొనుగోలు చేస్తాయి. కొనే పంట పరిమాణంపై ఎలాంటి పరిమితి ఉండదు. ఇందుకోసం త్వరలోనే ఒక పోర్టల్ ను డెవలప్  చేస్తం” అని గోయల్  తెలిపారు. తాము చేసిన ప్రతిపాదనలతో పంజాబ్ లో వ్యవసాయం మరింత మెరుగవుతుందని, భూగర్భజలాల మట్టం పెరుగుతుందని ఆయన అన్నారు. అంతేకాకుండా భూములు బంజరు కాకుండా కాపాడవచ్చని ఆయన పేర్కొన్నారు.

పదేండ్లలో 18 కోట్ల పంటను ఎంఎస్​పీకి కొన్నం..

2014లో కేంద్రంలో తమ ప్రభుత్వం వచ్చినప్పటి నంచి ఇప్పటి దాకా రూ.18 లక్షల కోట్ల విలువైన పంటను ఎంఎస్ పీ వద్ద కొన్నామని పీయూష్  గోయల్  తెలిపారు. కానీ, 2004 నుంచి 2014 వరకు యూపీఏ ప్రభుత్వం రూ.5.50 లక్షల కోట్ల విలువైన పంటను మాత్రమే కొనుగోలు చేసిందని ఆయన గుర్తుచేశారు. రైతులతో మరోసారి చర్చలు జరిపే అవకాశం ఉంటుందా అన్న ప్రశ్నకు రైతు లీడర్లు తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని ఆయన చెప్పారు.

ఎంఎస్​పీతో పంజాబ్  నంబర్ వన్: మాన్

రైతుల ప్రయోజనాలు కాపాడాలని కేంద్ర మంత్రుల వద్ద పట్టుపట్టానని పంజాబ్  సీఎం భగవంత్  సింగ్  మాన్  తెలిపారు. చర్చల తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుల ప్రతినిధిగా తాను కేంద్ర మంత్రులతో జరిగిన చర్చల్లో పాల్గొన్నట్లు మాన్​ తెలిపారు. మొజాంబిక్, కొలంబియా నుంచి పప్పుధాన్యాలను దిగుమతి చేసుకుంటున్నామని చెప్పారు. రైతుల పంటలకు ఎంఎస్​పీ ఇస్తే, దేశంలోనే పప్పుధాన్యాల ఉత్పత్తిలో పంజాబ్  నంబర్  వన్  అవుతుందని, రెండో హరిత విప్లవం వస్తుందని పంజాబ్​ సీఎం చెప్పారు.

మా యూనియన్లతో మాట్లాడాకే నిర్ణయం: రైతు లీడర్లు

కేంద్ర మంత్రుల ప్రతిపాదనపై తమ యూనియన్లతో పాటు నిపుణులతో చర్చిస్తామని, ఆ తర్వాత భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని రైతు సంఘాల నేతలు చెప్పారు. ఎంఎస్ పీ చట్టం, స్వామినాథన్  కమిషన్  రికమెండేషన్లు, రుణమాఫీ వంటి అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించామని రైతు సంఘం నాయకుడు జగ్జీత్  సింగ్  దల్లేవాల్  వెల్లడించారు. తమ డిమాండ్లను రెండు రోజుల్లోనే కేంద్రం పరిష్కరిస్తుందని ఆశిస్తున్నామని మరో రైతు సంఘం నేత సర్వాన్  సింగ్  పంధేర్  చెప్పారు. ప్రస్తుతానికి ‘చలో ఢిల్లీ’ ఆందోళనను నిలిపివేశామని, మొత్తం డిమాండ్లను నెరవేర్చకపోతే ఈ నెల 21 మళ్లీ ఉద్యమిస్తామని తెలిపారు.